పుట:Kanyashulkamu020647mbp.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడివికెళ్లి చెట్లెక్కి సమిధలు తెచ్చేవారు. రండికీ మొండికి ఓర్చెవారు. యిప్పుడు యింత ప్రాజ్ఞులైన మీరేవఁంటున్నారూ? మావాడు యిల్లుకదిలివెళ్లితే కందిపోతాడు, మావాడు జావఁచెట్టెక్కితే కాళ్లువిరుచుకుంటాడు అని భయపడుతున్నారు. మీశిష్యులు బ్రహ్మాండవైఁన మఱ్ఱిచెట్టు కొసకెక్కి ఆకులుకోసి తెస్తున్నారుకారా? మనపుస్తకాల్లో మర్మం కనుక్కుని దొర్లు బాగుపడుతున్నారు, మనపుస్తకాలు బూజెక్కించి మనం చెడుతున్నాం.

అగ్ని-- మీకు చాలాతెలుసును. యీతెల్లవాళ్లు చేసేవిద్యలన్నీ మనగ్రంధాల్లోంచి యెత్తుకెళ్లినవే. యీరెయిళ్లు గియిళ్లూ యావత్తు మనవేదంలో వున్నాయిష. మీది మాపరిశీలనైన బుద్ధి. మనకేసు గెలవడానికి మీరురాసిన సవబులు మాబాగున్నాయి.

గిరీ-- యింకాబాగుండును. రికార్డు పూర్తిగాలేదు. కొన్నికాగితాలు మీరే పారెశారో, మీవకీలు వుంచేసుకున్నాడో నాకు బోధపడకుండావుంది.

అగ్ని-- నేను పారెయ్యలేదండీ. నాకు యింగిలీషు తెలియకపోవడం చాలాచిక్కొచ్చింది.

గిరీ-- మీకే యింగ్లీషువొస్తె భాష్యం అయ్యంగార్లా అయిపోరా? యీమడి తడిపేసి, వున్నకాగితాలు యావత్తుకూ జాబితారాస్తాను, తమరువెళ్లండి.

అగ్ని-- మీరు సంసారం పనిపాట్లు యేం శ్రద్ధగాచేసుకుంటారు! మావాడికి మీలా ప్రయోజకత్వం అబ్బితే నాకొహడి అవసరంవుండదు. దిగేటప్పుడు నిమ్మళంగా సాయంచేసి మరీదింపండేం? కీడించి మేలించమన్నాడు

(నిష్క్రమించును.)

వెంక-- (నిమ్మళంగా) నాన్నయింట్లో కెళ్లిపోయినాడు.

గిరీ-- నిమ్మళంగాదిగు.

వెంక-- (వురికి) బతికించారు. (వెళ్లిపోబోవును.)

గిరీ-- ఆగు ఆగు ఆ వొళ్లొపళ్లిలా పట్రా.

వెంక-- దొబ్బుతారా యేవిఁటి అన్నీని? అన్యాయం!

గిరీ -- "అన్యాయం పాపనాశనం" అన్నాడు. ఒక్క అన్యాయంతో పాపాలన్నీ పోతాయి. అన్నిపళ్లూ నువుమాత్రం తింటావాయేమిటి? తింటే స్టమకేక్‌, కడుపు నొప్పొస్తుంది. కడుపు నొప్పొస్తే మీ అమ్మ నోరు పగల్దీసి సోలడు ఆవఁదం వసగుండా గొంతుకలో పోస్తుంది.

వెంక-- నేనావఁదం తాగను.

గిరీ-- అలా అయితే పళ్లట్టే తినకు (యాతాం వొదిలి వెంకటేశం వొళ్లోని కాయలు యెంచుచుండును.)

వెంక-- (యేడుపుమొహంతో) పెద్దపళ్లన్నీ దొబ్బుతారా యేవిఁటి?