పుట:Kanyashulkamu020647mbp.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామ- నీ అంత కర్కోటకుణ్ణి యక్కడా నేనుచూడలేదు. నీమాటకేం పెద్దవాడివి - పసిపిల్ల, కడుపునకన్న మీనాక్షికి వురిసిద్ధం అయితే, ముండా డబ్బుకి ముందూ వెనకా చూస్తావు! తలుచుకుంటే నాహృదయం కరిగిపోతూంది.

[సౌజన్యారావు పంతులు ప్రవేశించును.]

రామ- తమరు ధర్మస్వరూపులు. లుబ్ధావధాన్లుగారియందు అకారణమైన దయచేత యీకేసులో పనిచేస్తున్నారు. కేసంతా వట్టి అన్యాయమండి. ఒక్కపిసరైనా నిజంలేదు. శలవైతేగట్టి డిఫెన్సుసాక్ష్యం.

సౌజన్యా- నీసంగతి నాకు తెలుసును. అవతలికి నడువు.

రామ- తమరు యోగ్యులూ, గొప్పవారూ అయినా, ఏకవచనప్రయోగం-

సౌజ- నడువు!

[రామప్పంతులు నిష్క్రమించును.]

సౌజ- ఈదౌల్బాజీని తిరిగీ యెందుకు రానిచ్చారూ?

లుబ్ధా- పొమ్మంటే పోడుబాబూ.

సౌజ- యేవొఁచ్చాడు?

లుబ్ధా- యినస్‌పికటరికీ డిప్టీకలకటరికీ లంచం యిమ్మంటాడు.

సౌజ- డిప్టీకలక్టరుగారు లంచంపుచ్చుకోరు. ఆయన నాకు స్నేహితులు; నాకు తెలుసును. లంచాలూ పంచాలూ మీరు యిచ్చినట్లయితే, మీకేసులో నేను పనిచెయ్యను.

లుబ్ధా- తమశలవు తప్పినడుస్తే చెప్పుచ్చుకు కొట్టండి. నాకు భగవంతుడిలాగ తమరు దొరికారు - "పాలనుముంచినా మీరే, నీళ్లనుముంచినా మీరే" అని మిమ్మల్నే నమ్మి ఉన్నాను.

సౌజ- మీరు నేరంచెయ్యలేదని నాకు పూర్తిఅయిన నమ్మకంవుంది. నిజం కనుక్కోడానికి చాలాప్రయత్నం చేస్తున్నానుగాని ఆగుంటూరి శాస్తుల్లు యవడో భేదించలేకుండా వున్నాను. మీరు జ్ఞాపకం మీద చెప్పినచహరా గుంటూరు వ్రాసి పంపించాను. అక్కడ అలాటిమనిషి యవడూలేడని జవాబువొచ్చింది.

లుబ్ధా- అదేంమాయోబాబూ! మీసాయంవల్ల యీగండంగడిచి, నాపిల్లా నేనూ యీ ఆపదలోంచి తేలితే, నాడబ్బంతా, మీపాదాలదగ్గిర దాఖలుచేసి కాసీపోతాను.

సౌజ- మీడబ్బు నాకక్కరలేదని మీతో మొదటే చెప్పాను. నేచెప్పినమాటలు మీకు నచ్చి, ముసలివాళ్లు పెళ్లాడకూడదనీ, కన్యాశుల్కం తప్పనీ, యిప్పటికైనా మీకు నమ్మకం కలిగితే, యిలాంటి దురాచారాలు మాన్పడానికి రాజమహేంద్రవరంలో వక సభవుంది, ఆసభకి కొంచవోఁగొప్పో మీకు తోచిన డబ్బుయివ్వండి. వితంతువుల మఠానికి మీ పిల్లని పంపడం నా సలహా.