పుట:Kanyashulkamu020647mbp.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేతిలోకి వొస్తుంది. స్వాతంత్ర్యం కలుగుతుంది. "ఏమి ఇది?" అని అడిగేవాడుండడు. యిహ, చెడిపోవడానికి అభ్యంతరవేఁవిటి? "నేను కట్టుగావున్నానుకానా"? అని నువ్వు అనగలవు. నీ మొగుడితాలూకు ఆస్తి నీ చెయ్యి చిక్కలేదు. మొగుడి యింటికైనా నువ్వు వెళ్లలేదు.

బుచ్చ-- అవును.

గిరీ-- తల్లిదండ్రుల చాటున ఖాయిదాగా వున్నావు. పరాయివాడు యింట్లో అడుగుబెట్టలేడు. గాని యిలా యెంతకాలం వెళ్లుతుంది? నిన్ను తల్లితండ్రులు కలకాలం కాపాడలేరుగదా? వాళ్లు పోయినతరవాత నీకూ స్వాతంత్ర్యం వొస్తుంది. యేకాలానికి మనసు యలా వుండునో? అప్పుడు కాలుజారిన తరవాత, నువ్వు యేవఁనుకుంటావు? "అయ్యో నాడు గిరీశాన్ని శాస్త్రోక్తంగా పెళ్లాడి పునిస్త్రీనయిపోతే, పిల్లాపేకా కలిగి, అష్టైశ్వర్యంతో తులతూగుదునుగదా? యీ దురవస్థ నాకు రాకపోవునుగదా"? అని విచారిస్తావు. అప్పుడునే యెక్కడవుంటానూ? స్వర్గంలో మీకోసం యెదురుచూస్తూ వుంటాను. యీ పెళ్లి అయిపోయినతరవాత వెంకటేశమూ, నేనూ పట్ణానికి వెళ్లిపోతాం. నిన్ను, తలుచుకుంటూ నిద్రాహారం మానేసి, కొన్నిరోజులు వుంటాను. యెంతకాలవఁని మనిషన్నవాడు, నిద్రాహారంమాని వుండగలడు? నిన్ను తలుచుకుని తలుచుకుని నిద్దరపట్టక, రెండుఝాముల రాత్రప్పుడు నాగదిలో యీజీచెయిరుమీద కూచునివుండగా - యదట బల్లమీద మెరుపుదీపం, గోడని నిలువుటద్దం వున్నాయి - ఆ అద్దంలో నాముఖం చూసుకుని, యేమంటానూ? "యీ సొగుసైనముఖం, యీ తామరరేకులవంటి నేత్రాలు, యీ సోగమీసాలు. యివన్నీవృధాగదా? యవరు చూసి ఆనందించనూ? నాబుచ్చమ్మ, నన్ను పెళ్లాడక పోయినతరవాత నాబతుకు యెందుకు" అని, నిస్పృహాకలిగి ఛఱ్ఱున టేబిలు సొరుగుతీసి, అందులోవున్న జోడుగుళ్ల పిస్తోలు యెక్కుబెట్టి గుండె దూసిపోయేటట్టు కొట్టేసుకుంటాను.

బుచ్చ-- కొట్టుకోకండి. మీరు అలా అంటే నాకు యేడుపొస్తుంది.

గిరీ-- తక్షణం దేవతలు విమానం పంపించి నన్ను స్వర్గానికి తీసుకువెళతారు. స్వర్గానికి వెళ్లానని నాకు అక్కడమాత్రం సుఖవుఁంటుందనుకున్నావా వొదినా? నవాభరణభూషితురాలయి రంభతక్కుతూ తారుతూ వొచ్చి, "హా! ప్రియ! గిరీశ! నీలాటి సుందరుణ్ణి యన్నడూ నేను చూడలేదు. రమ్ము, నన్ను చేకొమ్ము," అని రెక్కబట్టుకు లాగుతుంది. నేనేవఁంటానూ? "చీ! అవతలికిపో! - నేను ఏంటీనాచ్చి! సానిది తాకితే, పరమ అపవిత్రంగా తలుస్తాను. పియర్సు సబ్బురాసి కడిగితేనేగాని యీచేతికి కశ్మలంపోదు.