పుట:Kanyashulkamu020647mbp.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యీవేళకి మతంమీద యింతవరకు లెక్చరు చాలును. యిక వెళ్లి దేవాలయం తోటలో కోతిపిల్లిని కఱ్ఱ ఆడుకో. సాయంత్రానికి నీతండ్రి వొచ్చేసరికి మాత్రం, దీపంయదట కూచుని పుస్తకం తిరగేస్తూ పులుస పటుకులు ధానంచెయ్యి. యింగువవేసి బలేసొగుసుగా తయారుచేస్తారు (వెంకటేశం వెళ్లును.) రనెవే.

(బుచ్చమ్మ ప్రవేశించి.)

బుచ్చమ్మ: యీ రుబ్బురోలునిండా తాటాకుముక్కలు పడుతున్నాయి, యివతలకి లాగేసిపెడతారూ.

గిరీ : అదెంతపని.

(గిరీశం రుబ్బురోలు, పందిరి అవతలకులాగును. బుచ్చమ్మ రుబ్బురోలు కడిగి మినపపప్పు రుబ్బును.)

గిరీ: (పాడును) "భజగోవిందం. భజగోవిందం. గోవిందం భజ మూఢమతే" యేం, వదినా, కంటనీరు పెడుతున్నారూ?

బుచ్చ: యేవీఁలేదు.

గిరీ: మీరు కంటనీరు పెడితే నామనసు కరిగిపోతూంది.

బుచ్చ: మీకేం - మహరాజులు - మాకష్టాలు మమ్మల్నే బాధిస్తాయి.

గిరీ: యేమి కనికరం లేనిమాట అన్నారూ! మీరు అలా దుఃఖంలో ములిగివుంటే, యెందుకు నాకీ వెధవ బతుకు? మీకోసం యేం చెయ్యమంటే అది చాస్తానే? ప్రాణవిఁచ్చెయ్యమంటే యిచ్చేస్తానే? దాఖలా చూడండి యిదుగో కత్తిపీట!

బుచ్చ: (కత్తిపీట దగ్గిరతీసుకుని) చెల్లికి యీ సమ్మంధం తప్పించారు కారుగదా?

గిరీ : అదొక్కటిమట్టుకు నాకు సాధ్యవైఁందికాదు.

బుచ్చ: అయితే మీతో నాకేం పనీ? యింత సందడిగా పెళ్లిపనులు చేయిస్తున్నారు. మానాన్నకి తోచకపోతే, మీకైనా తోచకూడదా, యీ సమ్మంధం కూడదని? మీకుకూడా దానిమీద యింత కనికరం లేకపోవాలా? లుబ్ధావుఁధాన్లు మీకు అన్నగారని కాబోలు మీకు సంతోషం.

గిరీ: నాకాసంతోషం? యంత క్రూరమైనమాట అన్నారు! యీ సంబంధం ఔతుందని, నా మనస్సులో యంత ఖేదిస్తున్నానో, ఆ భగవంతుడికి తెలుసును. యీ సంబంధం తప్పించాలని చెడచివాట్లుపెడుతూ మా అన్న పేర రెండు టావులు వుత్తరం రాశాను. చెవినిపెట్టాడుకాడు. నేను యేంచేతును? వాడిని స్మరిస్తేనే పాపంవొస్తుంది. ఊరికే కూచుంటే, మీతండ్రి యేవఁనుకుంటాడో అని, మీయింట అరవ చాకిరీ చేస్తూ నీకు యేనాటికైనా కనికరం వొస్తుందేమో అని ఒక్కమనిషిని నూరుమంది చేసేపని చేస్తున్నాను. అంతేగాని, యీ నమ్మిన నౌఖరుమీద నీమనసు భారంగావుంటే, యవరికీ చెప్పకుండా యీరాత్రి లేచి మాదేశానికి వెళ్లిపోతాను.