పుట:Jeevasastra Samgrahamu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ ప్రకరణము.

శాఖ (Stem)

మనమందరము జూచు హెచ్చుజాతి, అనగా, పూవులుగల వృక్షములలో ఏకబీజదళము (Monocotyledon), ద్విబీజదళము (Dicotyledon) అని రెండుజాతులు గలవు. వాని నిర్మాణమందలి ముఖ్యమైనభేదములు ఈ ప్రకరణమునందు అక్కడక్కడ సూచింపబడును. కాన నా జాతు లిచ్చో పేర్కనబడినవి.

ద్విబీజదళవృక్షములు.

చింతగింజ, సెనగగింజ, ఆముదపుగింజ మొదలగుకొన్నిగింజలను పగులగొట్టి చూచిన అందు రెండు పప్పుబద్ద లుండును. ఈ గింజలనుండి మొక్కలు భూమిలోనుండి పుట్టునప్పుడు మీరందరు చూచియేయుందురు. ఆచిన్న మొక్కలు భూమిపైకి రాగానే దానికొమ్మయొక్క మొదటిభాగముననుబ్బి దళమైన పైనిజెప్పిన రెండు పప్పుబద్దలును రెండువైపుల నుండును. వీనికి బీజదళములని పేరు. ఇవియే కొమ్మయొక్క మొదటియాకులు. వీనియందు సామాన్యముగా హరితకములు లేకపోవుటచేత నివి తెల్లగ నుండును. కొన్నిటియం దీబీజదళములు కొంచెమాకుపచ్చగగూడ నుండవచ్చును. సామాన్యముగా నివి తక్కిన యాకులవలె సూర్యకాంతిసహాయముతో గాలినుండి ఆహారమును తయారుచేయునవి.