పుట:Jeevasastra Samgrahamu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోడలుగాగల యొక ముక్కను కోయుము. దీని పీఠమును (Base) కొంచెము విల్లువంపుగా నుండి పైవైపున కుబ్బెత్తుగా నుండునట్లు కోయుము (పటములో 1,2,3 చూడుము). ఈ పీఠమును పైవైపునకును, కొనవైపు క్రిందికిని ఉంచి దానినే శాఖాంతకణ మనుకొనుము. మొదట 1,2,4 అనుగోడ ననుసరించి యొకపొర కోయుము. పిమ్మట 2,3,4 అనుప్రక్క ననుసరించి రెండవపొర ఖండింపుము. తరువాత 1,3,4 అను ప్రక్కనుండి మరియొకపొరను కోయుము (ఆప్రక్క చాటున బడుటచే పటములో కనబడదు). ఇట్లు ప్రతిసారి కోసినప్పుడును ఆదుంపముక్క పరిమాణమునందు తన యధాస్థితికి పెరుగునని యూహింపుము. ఇట్లు తెగిపోయెడుఖండములు తెగుచుండగా తల్లికణ మేమాత్రము తరుగులేనిదై యుండ ఒక్కొకసారి మూడుఖండముల చొప్పున ననేకఖండము లనవరతము వెడలుచుండును. ఈ ఖండములే ఉపాంత్యకణములు (21-వ పటములో B-లో ఉ. అ). ఇవి తత్క్షణమే చీలి యా చీలినచీలికలు తిరిగి యనేక కణములై నాచుమొక్కయందలి కణసముదాయ మేర్పడుచున్నది (21-వ పటములో B-చూడుము). ఆ కణములలో కొన్నిటియందు చిన్న చిన్న మొటిమలు పుట్టి యా మొటిమలే చీలి యాకు లగును. ఇట్లే క్రమముగా కొమ్మ పొడుగునందును ఆకులు సంఖ్యయందును వృద్ధియగుచుండును.