పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయవంతమైన చిత్రం కాకపోయినా, ఆ చిత్రంవల్లనే డబ్బుగుంజుకోగలడు డిస్ట్రిబ్యూటరు.

ఒక కంపెనీ పెట్టి చిత్రం తీయడం ప్రారంభిస్తే ఎంత మహోత్సవంలా అయిపోతుందో! వేలకొలది జనులు చిత్రం నిర్మించడానికి కావాలి. అందరూ నిర్మాతకు దాసానుదాసులవుతారు; కారులు, రిహార్సల్సు, తారలు రావడం, పోవడం, చిత్రంలో ఒక్కొక్కసంఘటన తీయడం! దానికై సెట్టింగులు, ఆ వెనుక దర్శకుడూ, ఛాయాగ్రాహకుడూ, శబ్దగ్రాహకుడూ కార్యక్రమానికి ఉపక్రమించడం. అంతకుముందు నగలు, నాణ్యాలు, దుస్తులు, సేకరించి సిద్ధం అవడం, స్త్రీ పురుష తారలకు వేషాలు వేయడం, సెట్టింగులలో దీపాలు అమరించడం, ఆ దీపాలతో పగటిలా చేయడం, ఆర్పేస్తూ ఉండడము! ఒక్కొక్క సెట్టుకు సంబంధించిన రంగాలన్నీ తీయడం! ఎంత గడబిడ! ఈ గడబిడకంతకూ అతడు తాను నాయకుడు. అందరూ అతని చుట్టూ మూగాలి అతన్ని కొలవాలి. పొగడాలి. గౌరవించాలి. అతడు సంపూర్ణాధికారి.

ఇదీ బుచ్చి వెంకట్రావు హృదయాంతరాన ఉదయించిన గాఢమైన కాంక్ష.

పద్మావతి యాత్రకు వెళ్ళిన అయిదవరోజున సుశీల, రాధాకృష్ణలు ఇద్దరూ బుచ్చి వెంకట్రావు దగ్గిరకు వచ్చారు. రాధాకృష్ణ తానే తన కారును నడుపుకొంటూ వచ్చాడు.

“రండి. దయచేయండీ!” అంటూ వచ్చి వెంకట్రావు వారిని లోని హాలులోనికి తీసుకొనిపోయినాడు.

రాధాకృష్ణ: వెంకట్రావుగారూ, త్యాగరాజ నగరంలో మొదటిరకం మేడ ఒకటి కుదిర్చాను. శుభముహూర్తం చూచి మనం పని ప్రారంభించడమే!

వెంకట్రావు: ఫష్టు! శుభముహూర్తం చూడండి!

రాధాకృష్ణ: మీ దగ్గర ఇప్పుడు ఎంతడబ్బు సిద్ధంగా ఉంది చెప్పండి?

వెంకట్రావు: ఇరవై అయిదు వేలున్నాయండి.

రాధాకృష్ణ తెల్లబోయినాడు. “ఇరవై అయిదు వేలతో మనం ఏం చేయగలం బుచ్చి వెంకట్రావుగారూ? పని ప్రారంభించిన పది రోజులకుకూడ సరిపోదే!” అని అతడు కాలుస్తున్న సిగరెట్టు సగంపైగా ఉందనగానే బూడిదరాల్చు గిన్నెలో పారవేసినాడు. “ఒక లక్షైనా పెట్టుబడితో ప్రారంభిస్తారనుకున్నాను!” అని అతడు కుర్చీలో కూలబడ్డాడు.

“నా దగ్గిర లక్ష ఎక్కడున్నాయి రాధాకృష్ణగారూ! నా వ్యాపారానికి అవసరమైన సొమ్ము అరవైవేలు. ఆ సొమ్ము మారుతూ వుంటుంది. ఏర్పరచుకొన్న జీతమూ, నావంతు లాభమూ, ఖర్చులుపోను మిగిలింది ఇరవై అయిదువేలున్నాయి. అది పెట్టి మాత్రమే సినిమా ప్రారంభించగలను. మీరు ఇతర భాగస్వాములను తీసుకువస్తామన్నారు కదా?” అని వెంకట్రావు రాధాకృష్ణను పృచ్చచేసినాడు.

సుశీల నెమ్మదిగా వారిరువుర దగ్గిరకు వచ్చింది. ఇంతవరకూ ఆమె ఇటూ అటూ పచారుచేస్తున్నది. “నా పేర వేసిన ఆరువేలూ వేసి నేనూ భాగస్వామిని నవుతాను. రాధాకృష్ణగారి దగ్గిర అయిదువేలున్నాయి. అంతవరకూ ఆయన వేస్తాడు. నా జీతమూ రాధాకృష్ణగారి జీతమూ నిర్ణయించి అది కూడా కంపెనీ వాటాలు చేయవచ్చును.” అని ఆమె గోడకు కట్టిన ఒక నవీన చిత్రం చూస్తూ నిలబడింది.

అడివి బాపిరాజు రచనలు - 7

161

జాజిమల్లి(సాంఘిక నవల)