పుట:Jagattu-Jiivamu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

జగత్తు - జీవము

మగు అసంఖ్యాక నక్షత్రాలను సముద్రములో నీటిచుక్కవలె పరిణమింపచేయు అనంతభువనాలలో ప్రయోగాలు జరుగుచునే ఉండ వచ్చును. నేటివరకు సంభవింపనిది అకస్మాత్తుగా ఒక్కత్రుటిలో వాటిల్లవచ్చును. తత్ప్రయోగ ఫలితంగా, ప్రమాద ఫలితంగా మనం లాభం పొందవచ్చును. జగచ్చైతన్యోపలబ్ధికి మన భావములు యథాశక్తి దోడ్పడుచుండవచ్చును. ఆశా కిరణ మిందు గోచరిస్తున్నది. జగత్ప్రణాళికలో మానవుడెట్టి నిరర్థకు డై నప్పటికి, తానూహించి గుర్తించగల అమానుష శక్తులకున్న స్థానమే మానవుని కుండితీరవలయును. ఆనంత్యంలో అల్పాధిక భేదంలేదు. ఆనంత్యంలో మనస్సొక ప్రధానస్థానం వహించిన దనుట అతిశయోక్తి కానేరదు.

పరమము, నిగూఢము, సమగ్రము, పరిణామ రహితము, జ్ఞానమయము అగు బుద్ధిగోచర ఆనంత్యం యథార్థమైనను, నిరంతర పరిణామమొందుచున్న ఇంద్రియగోచర ఆనంత్యం యథార్థమైనను, ఏదో ఒక ఆనంత్యంలో నిర్వాణమొందవలసియున్న మనగతి యోచింపవలెను.

ఇంద్రియగోచరమైనది తారామయ ఆనంత్యము, భువన సంకుల ఆనంత్యము. అందులో పరమాణువులు, గ్రహాలు, సూర్యులు, నక్షత్రాలు, నెబ్యులాలు మొదలగు వస్తుసముదాయమే గోచరిస్తున్నది. వీటి నిరంతర సంయోగవియోగములు, ఆకర్షణ ప్రతిహననములు, సంకోచవ్యాకోచములు గమనించి, తన్మూలంగా అపరిమితాకాశాన్ని అనంతకాలాన్ని విభజించి గణింప యత్నిస్తున్నాము. పరిశీలించగా ఈ అనంత్యంలో జీవంయొక్క లక్షణాలే గోచరిస్తున్నవి.