పుట:Jagattu-Jiivamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

జగత్తు - జీవము

ఎడ్డింగ్‌టను ఇట్లంటాడు : విశ్వంచుట్టు ప్రయాణంచేస్తూన్న కాంతి యొక్కస్పందం తగ్గిపోతున్నట్లు వర్ణపటగ్రాహకం (spectrograph) తెలియచేస్తూంది. సెకెనుకి 500 మైళ్లను మించినవేగంతో సర్పిల నెబ్యులాలన్నీ వెనుకకు పారిపోతున్నాయి. ఈ వక్రాకాశంలో పడి పోనుపోను వెనుకనుండి భూమిని చేరుకొంటాం.

సూర్యునిచుట్టు భూమివలె నక్షత్రమండలమంతా ఒక కేంద్రకం (nucleus) చుట్టు తిరుగుచున్నట్లుంది. దాని పరిభ్రమణకాలం 30 కోట్ల సంవత్సరాలు. ఈ భ్రమణచలనం ప్రకృతియొక్క లక్షణం. బృహద్వస్తువునుండి సూక్ష్మవస్తువువరకు ప్రతివస్తువులోను ఇది గోచరిస్తుంది. సూక్ష్మతమమైన ఎలక్ట్రాను నిరంతరం పరిభ్రమిస్తూంది. ఇదొక విశ్వవిశేషం.

నక్షత్రాలు మహావేగంతో ఆకాశయానం చేస్తున్నాయని విజ్ఞానులు చెప్తారు ; కాని అవి మనకెప్పుడు వాటివాటి యధాస్థానాలలోనే కనుపిస్తాయి. ఒకకోటి సంవత్సరాలు గతించిన తరువాత భూతలంనుండి ఆకాశంపరీక్షిస్తే యధాప్రకారంగానే కనిపిస్తుంది. ఈదీర్ఘకాలంలో కొన్ని నక్షత్రాలు కొద్దిగా స్థానచలనమొందుతాయి. కొన్ని ఎరుపెక్కుతాయి. కొన్ని పచ్చవారుతాయి. కొన్ని నీలమౌతాయి ; ఈ మార్పులన్నీ యంత్రాలు కనుగోవలసిందేగాని దృగ్గోచరంకావు. నీలస్నిగ్ధవియత్తలం యధావిధిగా నక్షత్రస్థాపితమై ఉంటుంది. ఇట్లు కొన్నికోట్ల సంవత్సరాలు పోయినతరువాత మంచుకొండలు బారులుదీర్చిన భూమికేతెంచి ఆకాశంచూస్తే సూర్యబింబ మొక ఎర్రని పెనంవలె కనిపిస్తుంది. తేజోష్ణప్రసారములీయగల సామర్థ్యం ఉడిగి అది నిరుపయోగమైపోతుంది. అప్పటికైనా నక్షత్రాలు, దుగ్ధపదం, అపరగెలాక్సీక నెబ్యులాలు మారుతాయా ?