పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 4.

ఇంద్రాణీ సప్తశతీ

97



17. ఏ దేవికి సమానమగుస్త్రీ ముల్లోకములందు లేదో, అట్టి సుందరి, నిత్య యౌవన, పురాతని యైన స్త్రీకి మేము నమస్కరింతుము.


18. ఏ దేవి పాదములకు గల సౌందర్యము మందార పల్లవములకు గూడ లేదో, అట్టి సుందరాతిసుందరములైన శచీదేవి పాదములను నే నాశ్రయింతును.


19. ఏ దేవి పదకాంతులు ప్రశస్త మాణిక్యములందైన లేవో, భాసురమైన వానికంటె భాసురమైన యా శచీ పాదములను నే నాశ్రయింతును.


20. ఏ దేవిపాదములను చితించుటవలన నరుడు పాపములచే తిరస్కరింపబడడో, అట్టి పవిత్రమైన వానికంటె పవిత్రమైన శచీపాదములను నే నాశ్రయింతును.


21. ఏ దేవియొక్క నఖములందు రాజిల్లు చంద్రకాంతులు తమస్సును బారద్రోలుచున్నవో, అట్టి యింద్రాణీ పాదములకు మంగళమగుగాక.


22. దేవతల కిరీట రత్న కాంతులచే కడగబడుచు బ్రకాశించుచున్న ఇంద్రాణి పాదములకు మంగళమగుగాక.


23. బాలసూర్య బింబమువలె భాసించునది, యోగీంద్రుల హృదయ గుహలందు దీపించునది యైన ఇంద్రాణియొక్క పాదపద్మమునకు మంగళమగుగాక.