పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



హేమలత



మొదటి ప్రకరణము

ఒకనాఁటి సూర్యాస్తమయ సమయమున శరీరమునందంతట భస్మముఁ బూసికొని కాషాయాంబరములఁ గట్టుకొనిన యొక మార్గస్థుఁడు యమునానది వైపునకు వచ్చుచుండెను. అతఁ డేగ్రామము నుండి వచ్చుచుండెనో యేగ్రామమునకుఁ బోవుచుండెనో యేఱిఁగిన వారెవ్వరును లేరు. మార్గ మధ్యమున నొకరిద్ద ఱాతనిని బలుకరించిరి కాని వారికతఁ డెట్టి ప్రత్యుత్తరమును నీయలేదు. అది వేసవి కాల మగుటచేతను, సకలజంతు భయంకరముగా నామధ్యాహ్నమున వీఁచుటచేతను, నామనుష్యుఁడు మార్గాయాసము వలన డస్సియుండెను. అతని యాయాసమునుబట్టి దూరప్రయాణము నతఁడు చేసెనని నిశ్చయముగాఁ జెప్పవచ్చును. ఆతఁడు రమారమి నలువది సంవత్సరముల వయస్సు గలిగియున్నను, నంత వయస్సుగల వాని వఁలె గన్పడఁడు. ఆ మనుష్యుఁడు పొడగరికాఁడు కాని కేవలము పొట్టియని చెప్పుటకు వీలులేదు. శరీరము చామనచాయఁ గలదియై యుండును,