పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

39

దిగ్గున లేచి బంధింపఁబడియున్న పితామహుని గాలయమునివలె నెదుటనిల్చి యున్న రహిమానుఖానుని యమదూతలరీతిఁ దన పితామహుని బట్టికొనియున్న రాజభటులను జూచి వెఱగుపడి శరవేగముతో నతని కడకుఁబోయి దాదా! దాదా! యని కెవ్వుననఱచి, వానిని గౌఁగిలించికొని రోదనము చేయసాగెను. రాజసేవకులకు వెఱచియో యనునట్లు సహజగాంభీర్యమును ధైర్యమును నారాయణసింగును విడిపోవ మనుష్య స్వభావమునుబట్టి పొరలి పొరలివచ్చు దుఃఖమునాఁపలేక యితఁడు మనుమరాలిని గౌఁగిలించికొని స్త్రీవలె అమ్మా! నేను జెరసాలకుఁబోవుచున్నాను, అని పెద్ద పెట్టున నేడ్చెను. ఇట్లువాపోవు వారినిరువురనుజూచి దయాహీనుఁడగు రహిమానుఖాను విచారమును లేశము నొందక హేమలత సౌందర్యాదులనుగని యానందించుచు వారినివిడఁదీయ భటుల కాజ్ఞయొసఁగి ముసలివానిని లాగనారంభించెను. ఈనడుమ గ్రామమునమన్న వారందు నీకలకల ధ్వనులవలనకు, మిన్ను ముట్టుచున్న వారిరోదన ధ్వనులవలనను మేలుకొని, మఠమునఁ జుట్టుకొని యా విచిత్రమును జూచుచుండిరి. దుఃఖభారమున నిలువలేక తాతమెడకుఁ దనబాహులతికలను బెనవైచి గాఢాలింగనముఁ జేసికొని విలపించుచున్న హేమలతను విడఁదీయుట దుర్ఘటమని తలఁచి తురుష్కులు ముసలివానిని లాగుచుండ నందొకఁడు కొరడాలతో బాలిక చేతుల మీద రెండు దెబ్బలు కొట్టెను. ఆనొప్పిచే బాలిక కౌఁగిలింతవదలెను. వెంటనే రాజభటులు నారాయణసింగును గెంటుకొనిపోవుటఁజూని “అయ్యో! దాదా! దాదా! నేనెట్లు బ్రదుకఁగలను! నన్నెవరికప్పగించి పోవుచున్నావు! నాకెవరుదిక్కు! నన్నుఁ దీసికొనిపోవేమి! నేఁజచ్చి పోవుదును, నేనుండలేను. అయ్యో! మాటాడవేమి? దాదా, యని సకలజనుల హృదయములను. నీరైపోవునట్లఱచి