పుట:Gurujadalu.pdf/546

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహా మిసిసిపి -మిసోరి ప్రవాహములకు బ్రహ్మ సమాజ మతమనేది పెద్ద ఆకట్టుకట్టువలే ఆచరిస్తున్నాది. బ్రహ్మ సమాజము లోకములో నుండు మతములన్నింటికన్నా Rational సవబయినదే అయిననూ లోకమున అవస్తాభేదము-రుచి భేదము కలిగి వుండుట చేత ఏజాయ మనుష్యులకు ఆజాయను జ్ఞానోత్పత్తి ధర్మోపదేశమూ చేయడము విధి గనుక తాము తర్కమును బట్టి సూటిగాపోవు బుద్దులకు బ్రహ్మమతోపదేశము చేయుచున్నారు. నేనంటిరో హిందూ మత గ్రంథములలో పురాణాదులు కేవల స్త్రీ పామరజన బోధక ప్రయోజనములుగా తొలగించి పాశ్చాత్యులు గూడా వేయినోళ్ళ పొగడు భగవద్గీతాది మహాగ్రంథముల సహాయమున ఆర్య మతమునకు చిరకాలమావరించిన తృప్పును గడగి ఆచార్య నిర్దిష్ట కర్మ - వేదాంత మార్గములను చదువరుల కంటికింపుగ గనపర్చ ప్రయత్నిస్తుయున్నాను.

కేశవ : యేరీతినయినా నాస్తికతా పాపముయడల భీతి-పుణ్యము యడల ఆసక్తి కలుగ చెయ్యడం యిప్పుడు మన దేశములో అత్యావశ్యకములైనప్పటికి మనవాళ్ల అవివేకానికిమేర లేకుండా వున్నది.

ది.రా : Pardon me. యేదో ఒక తరహా అంటే ఇంచుక నేను తమ అభిప్రాయముతో భేదించవలసి వస్తుంది. క్షమించవలయును. యే రీతిగానైనా ఆస్తికత అంటే యిదిగో ఛండాలుడు యెనుపోతును వేటవేసి మరిడమ్మకు పూజ చేస్తాడు. మనమునూ అట్టుల చేయగలమా? సంఘములో పై అంతస్తుల వారమైన మనము Rational Religion కలిగి వుండవలెను. అట్టి మతము క్రమక్రమంగా క్రిందివారికి దిగును. సవబునే నేను పూజిస్తాను. థియాషిపిష్ణు మతము వలె పేడా బెల్లం కలిపి మనవాళ్ళు సంతోషించడం కొరకు ప్రతి వెర్రి మొర్రి వ్రాతకు సందర్భార్థము కల్పించడము ప్రతి అవకతవక ఆచారముకు రహస్యసవబులు గుణములు కల్పించడము - యేమంటారు? తాము అట్టి వెర్రి మాయల నమ్మజాలరే?

కేశవ : నిజమే!

ది.రా : అట్టి ప్రవర్తన కలవారితో రాజీ లెల్లను యెట్లు పాటించతరమనవలయును. మతసంబంధ మయిన ఆ తర్కిత ఆచరణలో మన వాకిటలోనే కొండంత inconsistency వున్నది చూడండి. నాయుడు గారు - మనమాధవయ్య గారున్నారు - వారి యోగ్యత ఆంధ్ర పాండిత్యమూ, కవితా సామర్థ్యము - మన దేశమున కెల్లా అలంకార భూషితములయియున్నవే - వారు బ్రహ్మ సమాజ మతము నెన్నాళ్ల నుండియో అవలంబించి, ఆ మతమునకు మొనగాండ్లయి వున్నారు. విధవా వివాహములు

గురుజాడలు

501

కొండుభొట్టీయము