పుట:Gurujadalu.pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పార్వ : (ఒక చేతితో విస్తరంటలో అట్లున్నూ, రెండవ చేతిలో రూపాయిలున్నూ పట్టుకొచ్చి అట్లు కింద వుంచి) అట్లు తిను.

వెంక : కాళ్ళూ చేతులు కడుక్కుని తడిగావంచా కట్టుకుని తింఛాను.

పార్వ : (తనలో) వెర్రివెధవా. (పైకి) మీ బాబు కాళ్లు కడుక్కొంది వీధిలోంచి వొచ్చిన బట్టతో తింటాడు కాని. నీకు అంతకన్న ఆచారం బలువయి పోయిందీ? తిన్నగా తిను.

వెంక : కాళ్లూ చేతులు కడుక్కోవద్దంఛావా ఏమిషి.

పార్వ : కాళ్ళు కడుక్కుంటే చప్పుడవుతుంది.

వెంక : చప్పుడవుతే యేమిషి?

పార్వ : (తనలో) మొద్దు వెధవ! (పైకి) అంతా లేస్తారు.

వెంక : (గట్టిగా) ఓ! హో! దొంగతనంగా తెచ్చావు?

పార్వ : నిమ్మళంగా మాట్లాడు. చెప్పినట్టు వినకపోతే రూపాయిలివ్వను.

వెంక : అనాచారంగా తింటే యిస్తానంఛావా (తినను)

పార్వ : పది రూపాయిలిస్తే యేం చేస్తావు?

వెంక : పొగాకు కొని పొడుం కొట్టు పెడుతాను. నేను పొడుంకొట్టు పెట్టానంటే వాడి కొట్టు పడిపోతుంది.

పార్వ : గట్టిగా మాట్లాడకు.

వెంక : నా పొడుం యెంత బాగా వుంటుందనుకున్నావేమిటి, చిన్న పట్టు పీల్చిచూడు. (అని ఎడమ చేతిలో మొలనున్న పొడుంకాయ చూపించును)

పార్వ : (ముక్కుమీద వేలుంచి) ఆడవాళ్లు పొడుం పీలుస్తారుట్రా? (పొడుంకాయ మొల్లోంచి తీసి రూపాయలు మొలలో ముడుచును. ఆలాగు చేయుటలో తన శరీరము వెంకన్న పార్శ్వమునకు తగిలించును.)

వెంక : (తనలో) యిదేమిషోయి మీదపడుతూన్నది.

పార్వ : (అట్టుముక్క తానుకొరికి వెంకన్న నోటి కందించును.)

వెంక : యిదేమిటి, యెంగిలితినమంచావా యేమిషి,

పార్వ : నేచెప్పినట్టు వింటానన్నావే? (అని నోటిలో కుక్కును. )

వెంక : (అయిష్టముతో మింగుతూ) యెంగిలి తినడానికి పది రూపాయిలు యిచ్చావంషావు?

గురుజాడలు

477

కొండుభొట్టీయము