పుట:Gurujadalu.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జిన : పడపడ వాగితే, యీ రాజులు డంగైపోతారు. నాలుగు పంక్తులు వ్రాస్తే పస బయలు పడుతుంది. పత్రికావాదం పెట్టి, పత్రికలు కాశీకి పంపమనండీ; బలాబలాలు తెలుస్తాయి.

(కవి రామశాస్త్రి ప్రవేశించును.)

గోవింద : అతగాడికి ఉపాసనాబలం వుందండీ. వాదన సమయంలో నాకు యెన్నో యుక్తులు స్ఫురిస్తాయి. వాక్థ్సంభనఐ మాట పైకి రాదు. మనిషిని గెలియడం శక్యంగానీ, మంత్రాన్ని గెలియడవెఁలాగ.

రామ : అంత పెనుప్రళయం అతగాడిలో యేమీ కానరాలేదే?

మాధ : (రామశాస్త్రిని పక్కకు పిలిచి) యేనాటికి యేవొఁస్తుందో తెలియదు.

రామ : యిప్పుడే వొఁచ్చింది ?

మాధ : యీనాటికి యామినీదేవికి చదువు చెప్పడానికి నేను తగాను కాను.

రామ : యేమండి?

మాధ : యేమో, రాజుగారికే తెలియాలి. రేపటినుంచీ బిల్హణుడిచేత విద్యచెప్పిస్తారష!

రామ : అలాగనా, ప్రభుచిత్తం మనవేఁం చేయ్యగలం?

మాధ : అంచాతనే దేశాంతరం వెళ్ళడానికి ఆలోచించాను.

రామ : అట్టి ఆలోచన యెన్నడూ చెయ్యకండి. మీరు పిల్లలవాళ్లు, యిల్లూ వాకలీ, తోటా దొడ్డీ కల్పించుకున్నారు. యెక్కడికి వెళ్లినా లోకం అంతా వక్క రీతిగానే వుంటుంది. మరి వక రాజ్యంలో మాత్రం ధర్మం నాలుగు పాదాలా నడుస్తుందనుకున్నారా? వెఱ్ఱిభ్రమ! ఆకాడికి మనరాజ్యవేఁనయం. రాజు సత్యసంధుడు. నిలబడి నిర్వహించడం నీతిగాని యెవడో డంబాచారి వచ్చాడని నొగలు విప్పి వెయ్యడం పౌరషవేనా?

మాధ : నాలుగు రోజులు జబ్బు పేరు పెట్టుకొని యింట వుండిపోదునా?

రామ : రాజు పోల్చుకొని కార్పణ్యం వహించగలడు.

మాధ : అయితే యేం జేదాం?

రామ : (మెల్లగా) యిసుంటారండి (నాలుగు అడుగులు యెడంగా వెళ్ళి) కపట స్నేహం చేశి వాడి లోతుపాతులు కనిపెట్టండి. కర్తవ్యం ముందు ముందు ఆలోచించుకుందాం.

మాధ : మీ సలహా బాగుంది.

రామ : సాయంత్రం కలుసుకు మాట్లాడుదాం. ఇప్పుడు యెడంగా వెళ్ళిపొండి. బిల్హణుడు వస్తున్నట్టుంది.

(బిల్టణుడును, పురోహితుడును ప్రవేశింతురు. )

గురుజాడలు

429

బిల్హణీయము