పుట:Gurujadalu.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధు : మీ మాట నేను నమ్మను (అవుధాన్లు దగ్గరకు వెళ్ళి ముఖంయదట ముఖం వుంచి) ఆ మాట నిజమా?

లుబ్ధా : అంతా నిజం అంటున్నారు.

మధు : సిద్ధాంతిగారేవఁన్నారు?

లుబ్ధా : జాతకం చూసిన సిద్ధాంతల్లా ఆ మాటే అంటున్నాడు. యిదివరకల్లా నాజాతకం మా గట్టి దాఖలా యిస్తూంది. ఒక్కటీ తప్పిపోలేదు.

మధు : అయితే మీ ప్రారబ్ధం. ఆ పెయ్యనాకుడు పిల్లని మాత్రం యీ పంతులు మాయ మాటలు విని చేసుకోకండి.

రామ : భోంచేస్తూ వొచ్చావు, యేం పుట్టి ములిగి పోయిందని?

మధు : వెండిగిన్నె కోసం వొచ్చాను.

రామ : తీసుకెళ్ళు (మధురవాణి నిష్క్రమించును.)

లుబ్ధా : పెళ్లి చేసుకోవద్దంటుందేవఁండీ?

రామ : నిమ్మళంగా మాట్లాడండి. సానిది యక్కడైనా పెళ్లి చేసుకోమంటుందయ్యా? నీ మీద కన్నేసింది.

లుబ్ధా : నామీద కన్నెయ్యడవేఁవిఁటి మావఁగారూ! యవరు విన్నా నవ్వుతారు.

రామ : మీరు గానీ పెళ్లి చేసుకోవడం మానేస్తే, మీ యింట్లో వచ్చి బయిఠాయిస్తుంది. అది ఘంటాపథంగా చెబుతూవుంటే చెవుల్లేవా యేవిఁటి మీకు? దానితో మీరేవఁయినా వెర్రి వెర్రి చాష్టలు చేశారంటే మీకూ నాకూ పడుతుంది గట్టిరంథి. జాగ్రతెరిగి మసులుకొండి.

లుబ్ధా : నేనా? నేనా? యేవిఁటి అలా శలవిస్తున్నారు. మావాఁ ! నా పిల్ల ఒకటీ అది వొకటీనా? ఆ గుంటూరు శాస్తూల్లు వున్నాడో వెళ్ళాడో, ఒక్క మాటు కనుక్కోలేరో?

రామ : యదటింట్లోనే బసచేశాడు. కనుక్కుంటాను గాని, మధురవాణి భోజనం యేపాటి అయిందో చూసి మరీ వెళతాను (లోపలికి వెళ్లి వచ్చి పైకి వెళ్లును.)

లుబ్ధా : మధురవాణి తీసుకుపోతాననుకుంటున్నాడు యీ పంతులు అహ! హ! (పొడుము పీల్చి) మనిషికీ మనిషికీ తారతమ్యం సాందే కనిపెట్టాలి. పంతుల్లాగ మీసం వుంచుకుని, రంగు వేసుకుంటే, తిరిగీ యౌవ్వనం వస్తుంది. యీ చవక సంబంధం కుదిరినట్టాయనా యేమి అదృష్టవంతుణ్ణి!