పుట:Gurujadalu.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శిష్యా! రెండు పళ్లు రాల్చు. వెంక : నాన్నొస్తున్నాడండోయి దిడ్డీతోవ్వేపు. యేవిఁటి సాధనం? గిరీశం: ఆకులు దట్టంగా వున్నవేపు దాగో. నేను యాతాం తోడ్డం ఆరంభిస్తాను. (అగ్నిహోత్రావధాన్లు ప్రవేశించి). అగ్ని : గిరీశం గారూ, నీరు తోడుతున్నారండీ? అసిరిగాడు తోడుతాడే, యింగిలీషు చదువు కున్న వాళ్లు, మీ కెందుకాశ్రమ? గిరీశం: పనివంటి వస్తువ లోకంలో లేదండి. ఊరికే కూచుంటే నాకు వూసుపోదు, మొక్కలకా, మంచిది. నాకా, కసరత్తూ. గవునరు, తోట్లో గొప్పు తవ్వుతాడు. సీవఁరాణీ వారు బీదలూ, సాదలకీ యివ్వడానికి బట్టలు కుడతారు. యింగిలీషువాడు సోమరితనం వొప్పడండి. వాళ్లలో పెద్ద కవీశ్వరుడు షేక్ స్పియరు యేవన్నాడో విన్నారా, “డిగ్నిటీ ఆఫ్ లేబర్” అన్నాడు - అనగా కలక్టరు గొప్ప వాడు కాడు; జడ్జి గొప్పవాడు కాడు, కాయక్లేశపడి కష్టపడే మనిషే గొప్పవాడన్నాడు. అంచాతనే యీ గొప్పదొర్లంతా మెప్పు పొందాలంటే తోటమాలీ పని చేస్తారు. చెట్లూ చావఁలూ యెక్కడం వొహటి వాళ్లలో గొప్ప విద్య, లాభం లేని పని యేదీ దొరచెయ్యడండి మావఁగారూ. దొరగారు వూర్నించి వూరికి వెళుతూండగా దాహవేఁస్తుంది - చెట్లని పళ్లుంటాయి. నడి తోవలో చెట్టెక్కడం నేర్చుకోకపోతే దాహంతో చావవలసిందే గదా? యేజన్సీ కమాన్ చేస్తూ వుంటే పెద్ద పులి వొస్తుందనుకోండి. దొరకి చెట్టెక్కడం చాతయితే చపాల్న చెట్టెక్కి ప్రాణం కాపాడుకుంటాడు. అంచేత చదువుతో పాటు చెట్లెక్కడం కూడా నేరుస్తారు. అగ్ని : దొర్ల తరిఫీదంతా అదో చిత్రం. వెంకడు రాసుకుంచున్నాడా, చదువుకుంచున్నాడా అండి? గిరీశం: యింతసేపూ చదువు చెప్పి “చెట్లూ చావఁలూ యెక్కి ఆడుకో” అని తోలేశాను. అగ్ని : మీకేం మతిపోయిందా యేవిఁటండి? కాలూ చెయ్యీ విరుచుకుంటే? గిరీశం: రేపు మన వాడికి గుణుపురం తాసిల్దారీ అయి అడివిలో కమాను వెళుతూ వుండగా పెద్దపులొస్తే చెట్టెక్కలేక, కాళ్లు వొణికి చతికిలబడాలని మీ అభిప్రాయవాఁ యేవిఁటి? అగ్ని : మనవాడికి తాసీల్దారీ అవుతుందండి? గిరీశం: యెందుక్కాకూడదూ? గుల్జాలెక్కడం, చెట్లెక్కడం మనవాడు నేర్చుకోకపోతే, “నాయనా నువ్వు కమాన్లకి పనికిరావు, డసుకు దగ్గిర కూచుని గుమస్తా పని చేసుకో, తాసిల్దారీ గీసిల్దారీ తల పెట్టకు” అని దొర్లంటారు. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 280