పుట:Gurujadalu.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెంక : (తడుముకుంటూ) దేర్ యిజ్ నాట్ ఏన్ ఆబ్జక్ట్ ఇన్ క్రియేషన్ వుచ్ డజ్ నాట్ సెర్వ్ సమ్ యూసఫుల్ పర్ప్ప. గిరీశం: అట్టే! అట్టే! అక్కడ నిలుపు, క్రియేషన్ అనగా యేమిటి? వెంక : క్రియేషన్ అనగా అనగా ఆవులు. గిరీశం: నాన్సెన్స్, చదవేస్తే ఉన్న మతి కూడా పోతున్నది. ఆవులు యెదటవున్నాయనా ఆవులంటు న్నావు? మళ్ళీ ఆలోచించి చెప్పు. వెంక : యే మాటకి అర్థం అడిగారండీ? గిరీశం: క్రియేషన్ వెంక : ఆదా! క్రియేషన్ అంటే ప్రపంచం. నేను, యెదట ఆవులు కనబడితే యీ ఆవు పెరుగు యీ నెలరోజులేకదా తినడవఁని ఆలోచిస్తూన్నాను. గిరీశం: వన్ థింగ్ ఏట్ ఏ టైమ్. యిప్పుడు పాఠం మాట ఆలోచించు. క్రియేషన్ అనే వక్కమాట పైనే వక్క ఘంట లెక్చరు యివ్వవచ్చును. ప్రపంచం యేలా గున్నది? కపిద్ధాకార భూగోళా అని మనుధర్మ శాస్త్రంలో చెప్పినాడు. కపిద్ధమంటే యేమిటి? వెంక : నారింజపండు గిరీశం: వెరిగుడ్. అందుకు అమర నిఘంటులో పద్యం నీకు వచ్చునా? వెంక : రాదు. చెప్పండి రాసుకుంటాను. గిరీశం: యింతలు బదరీ ఫలములు యింతలు మారేడు బళ్ళు యీడుకు జోడై బంతులు తామర మొగ్గలు దంతీకుచ కుంభములబోలు తరుణీ కుచములూ. యీ ప్రపంచములో యేమివస్తువులుంటవి? వెంక : ఆవులు. గిరీశం: డామ్ నాన్సెన్స్, యెంతసేపూ ఆవులేనా? యేవిఁటి వుంటవో బాగా ఆలోచించి చెప్పు. వెంక : గేదెలు. గిరీశం:దట్ విల్ నాట్ డు, మళ్లీ ఆలోచించి చెప్పు. వెంక : అయితే నాకు తెలియదు. గిరీశం: విడోస్-యింత చిన్న ప్రశ్నకు నీకు జవాబు తెలియదు! ప్రపంచమందుండే వస్తువు లన్నిటి లోకీ ముఖ్యమయినవి విధవలు. దాని విషయమై పెద్ద లెక్చరు యివ్వ వచ్చును. మనదేశములో ఒక దురాచారము వున్నది. మొగవాడికి పెళ్లాము చచ్చిపోతే తిరిగి గురుజాడలు 268 కన్యాశుల్కము - మలికూర్పు