పుట:Gurujadalu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కరటక: లుబ్ధావధానులుగారికీ తమకీ చాలా స్నేహమటా? తమ మాట అడుగు దాటడని విన్నాను.

రామప్ప. ఆ గాడిదెకొడుకుకు ఒకడితో స్నేహమేమిటండీ, వాడి ప్రాణానికీ డబ్బుకీలంకే. డబ్బుకీ వాడికీ స్నేహముగాని మరియెవరితోనూ స్నేహములేదు. అయితే వాడికి వ్యవహార జ్ఞానం బొత్తిగా లేదు. కోర్టు అంటే భయపడతాడు. అంచేత నా సలహాలేక బతకలేడు.

కరటక : నేను కృష్ణాతీరమునుంచి వస్తున్నాను. భూములమీద చాలా ఋణం అయిపోయినది. ఈ పిల్లని నందిపిల్లిలో, వేంకటదీక్షితులు గారికి, పదిహేనువందల రూపాయీలకు అమ్మి ఆ ఋణం తీర్చుకోవాలని అంతా సిద్ధంచేసుకుంటే మాసంరోజులకు గానీ, రూపాయిలు యివ్వలేమని ఆయన అన్నారు. పదిహేనవ తారీఖులోగా రూపాయాలు చెల్లకపోతే భూములు పోతాయి. ఇంతట్లో లుబ్ధావధాన్లుగారు వివాహప్రయత్నం చేస్తున్నారని విని ఆ సంబంధం మానుకుని యీలాగు వచ్చినాను. ఈ పిల్లను ఆయనకు అమ్మివేసి ఋణవిముక్తుణ్ణి కావలెనని ఆలోచిస్తూన్నాను. ఇదిగాని సమకూరిస్తే మీకు పది వరహాల సొమ్ము దాఖలు చేసుకుంటాను.

రామప్ప: నలభై, యాభై రూపాయిల వ్యవహారాల్లోకి చొరబడే వాడనుకాను. అయినా మీరు దూరదేశమునుంచి వచ్చినారు. ఈపాటి ఉపకారం చేతునుగాని మించిపోయింది. పది రోజుల కిందటవస్తే అయిపోవును. అప్పుడే సంబంధం రహితమయినది. అయితే మీది యేనాడి?

కరటక: యేనాడి కావలిస్తే ఆనాడే అవుతుంది. మేము వెల్నాట్లం.

రామప్ప: చూచారా! అది వక వుపద్రం, వారు వేగినాట్లు - యెందుకయినా వేరే ఒక చోట ప్రధానం అయిపోయినది.

కరటక : ఈ కార్యం సమకూరిస్తే నాకు దొరికే దానిలో నాలుగోవంతు మీకిస్తాను.

రామప్ప: యెంతయిస్తేనేమిటి? మించిపోయినదని మనవి చేసినాను కానూ, ఇంకా మరి వకపని | కావలిస్తే చేస్తాను. మీ భూములు తనఖా యిచ్చాం అన్నారు గదా, తనఖా దస్తావేజు చూపిస్తే, అదీ చెల్లకుండా సాక్ష్యం సంపన్నం సంపాదించి గ్రంధం చేయిస్తాను.

కరటక: సాక్షులు యెవరు దొరుకుతారండి?

రామప్ప: మధుపాడా, గరికివలసా, యింకా మరికొన్ని అగ్రహారాలూ వున్నాయి కావండీ, ఉర్లాం బసవరాజు గారి పద్దులెఖ్కే దొంగసాక్ష్యాలకు కూడా పనికివస్తుంది. కుండనాలుంటే పది. లేకుంటే ఆరు. నా తమాషా చూడండి యీ విషయంలో కావలిస్తే యాభయి సాక్ష్యాలు తీసుకువస్తాను. లాంటివి యెన్ని వ్యవహారాలు మోసేశానండీ.

గురుజాడలు

155

కన్యాశుల్కము - తొలికూర్పు