పుట:Gurujadalu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కన్యాశుల్కము

ద్వితీయాంకము

ఒకటవ స్థలము - అగ్నిహోత్రావధాన్లుగారి యింటి యదుటి వీధి

(గిరీశ, వెంకటేశ్వర్లు, ప్రవేశించుచున్నారు.)

వెంకటే: నిన్నరాత్రి కన్యాశుల్కముమీద లెక్చరు యిచ్చారా?

గిరీశ: లెక్చరేమిటోయి ధణుతు ఎగిరిపోయినది. మీ తండ్రిది మైరావణచరిత్రోయి. మీ అంకుల్ కరటక శాస్త్రి స్కౌండ్రల్‌లాగ కనబడుతున్నాడు.

వెంకటే: ఏమి జరిగిందేమిజరిగిందేమిటి?

గిరీశ : రాత్రి భోజనాలవేళ లెక్చరు ఆరంభించమని రోజల్లా బురిడీలు పెట్టి నేను సబ్జక్టు అందుకునేటప్పటికి తనుకూడా సపోర్టుచేస్తానన్నాడు గాని నాకు మీ తండ్రివైఖరీ చూస్తే లెక్చరు ఆరంభిద్దామని నోటికొసకి అక్షరము వచ్చి జంకి మళ్లీ వూరుకుంటూ వుండేవాడిని. తుదకు పెరుగూ అన్నము కలుపుకునే వేళకు యిక టైమ్ మించిపోతుందని ఆరంభించాను ఇంకా ఇన్‌ట్రడక్షన్ రెండు సెన్‌టెన్‌సెస్ చెప్పలేదు. నాలుగు ఇంగ్లీషుమాటలు దొర్లేయి దాంతో మీ తండ్రి గుడ్లు యర్రచేశి ఈ వెధవ యింగ్లీషు విద్యనుంచి బ్రాహ్మణ్యం చెడిపోతున్నది దేవభాషలాగ భోజనాలదగ్గిరకూడా ఆ మాటలే కూస్తారు, సంధ్యా వందనము పురుషసూక్తము శ్రీసూక్తపారాయణ తగలబడి పోయినది కదా అని గట్టిగా కేకలు వేశేటప్పటికి నేను కొంచము పస్తాయించి థ్రోయింగ్ పెర్‌ల్‌స్ బిఫోర్‌స్వైన్ అనుకుని కరటశాస్త్రులు ఏమయినా హెల్‌పు చేస్తాడేమో అని అతనివైపు చూశాను. వులకలేదు పలకలేదు సరేకదా మొఖటు తిప్పేసి కడుపు పగిలేటట్టు నవ్వుతూ కూర్చున్నాడు. యిక లెక్చరు వెళ్లిందికాదు సరే కదా నోటిలోకి ముద్దకూడా వెళ్లిందికాదు. ఛీ యింత ఇన్‌సల్ట్ జరిగిన తరవాతను తక్షణం బయలుదేరి వెళ్ళిపోదామనుకున్నాను.

వెంకటే: అయ్యయ్యో వెళ్లిపోతారా యేమిటి?

గిరీశ : నాట్ ఇన్ ది లీస్ట్. కొసాకు విను నీ తండ్రిని అప్పుడే పోకట్‌లో వేశాను.

వెంకటే: అయితే మరి లెక్చరు ఇచ్చి పెళ్లి తప్పించేస్తామన్నారే.

గిరీశ: పెళ్లి ఆపడానికి బ్రహ్మశక్యంకాదు. డిమోస్తనీస్ సురేంద్ర నాథ్ బానర్‌జీ వచ్చి చెప్పినా కానీ నీ తండ్రి ఆ పెళ్లి మానడు. లెక్చరెంతసేపూ సిటీలలోనే కాని పల్లెటూళ్లలో పనికిరాదు. పూనాలాంటి సిటీలో లెక్చరు ఇచ్చామంటే టెన్‌థౌజండు పీపిల్ వినడానికి

గురుజాడలు

146

కన్యాశుల్కము - తొలికూర్పు