పుట:Goopa danpatulu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిగులక సుఖజీవనము చేయుటకు మాత్రము మిగులుచుండును. అప్పలసామియు గంగమ్మయు బలముగలవారగుటచేత దినమునకు మూడునాలుగుసేరుల పాలు త్రాగుదురు.

ఆయేట దమిళుల యుగాదిపండుగవచ్చెను. నాడు స్టేషన్‌మాష్టరుగారి యింట మరల నుత్సవము జరుగనున్నది. వారినెయ్యురెందఱో విందారగింప రానున్నారు. దక్షిణదేశమున బాలతో జేసికొను పిండివంటలెన్నియో వారు చేసికొన నిశ్చయించికొనిరి. గంగమ్మను నాల్గుకుంచముల క్షీరములను దెమ్మని వారు నియమించిరి. సూర్యోదయమగుసరికి గంగమ్మ తనపనులకాపరులచే నాపాలుపట్టించుకొని మాష్టరుగారిగృహమున కేగెను. సుందరమ్మ గంగమ్మనుజూచి యత్యానందముతో శుభ్రముగా దోమిన పాత్రలనుదెచ్చి పాలనుబోయించుకొని వానిస్వచ్ఛతకు నిర్దుష్టతకును నెంతోమెచ్చు కొనెను. గంగమ్మ తన యమాయకత్వమును వెల్లడించుచు నించుకమాటాడి చెన్నపురిలోని పాలవర్తకులరీతి యెట్టులుండునని సుందరమ్మనడిగెను.

సుంద - మా చెమ్మపట్టణములో నిండ్లకావులను దీసికొనివచ్చి పాలు పిదికియిత్తురు. మోసముచేయువారు తక్కువ గానుందురు. పాలెదుట బిదుకకున్నచో నీళ్ళు గలుపకమానరు. కాని మాయూరిపాలు నీవిచ్చుపాలంత రుచ్యములుగావు.

గంగ - పాలలో నీళ్ళు గలుపనప్పుడు వాని రుచియేల