పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

గోన గన్నా రెడ్డి

కొనుక్కుపోయేవారు. ఈ పరిశ్రమచేసే శాలలు ఒరంగల్లులో ఎన్నో ఉండేవి. ఈ పరిశ్రమను పట్టుసాలీలు, స్వర్ణకారులు కలిసి చేసేవారు.

2

మల్యాలవారి సైన్యం ఓరుగల్లునగర బాహ్యపువాడలలో ఆగింది. మల్యాల వారివాడ. రేచర్లవారివాడ, విరియాలవారివాడ, ఇందులూరివారివాడ, గోనవారివాడ మొదలయిన సామంతుల సైన్యాలూ, ఉద్యోగులూ ఉండే పేటలు ఉండేవి.

మల్యాలవారి సైన్యం, సిబ్బందీ మల్యాలవాడ చేరుకున్నారు. గుండయ భూపతి, కుప్పసానమ్మ, అన్నాంబిక, కోటలోపల ఉన్న మల్యాలనగరు చేరుకున్నారు. మల్యాలవారి రాచఏనుగులు, గుఱ్ఱాలు దక్షిణద్వారాన ఓరుగల్లుపురం చొచ్చాయి. అలాగే దక్షిణపు గోపురద్వారాన కోటలోనికిన్నీ వెళ్ళి ఉత్తరంగా ప్రయాణించి తూర్పుకు తిరిగి తూర్పుద్వారానికి కొలది దూరంలోఉన్న మల్యాలనగరు చేరుకున్నవి.

ముందుఏనుగుపై మల్యాల గుండయ్య ప్రభువు అధివసించి ఉన్నారు. వారి వెనుక మహారాణి, అన్నాంబిక అధివసించిన మత్తేభము, ఆ వెనుక రాజకుమారుల ఏనుగులు మూడు వచ్చినవి. ఆవెనుక రాజగుఱ్ఱాలు ఏబది, ఆ గుఱ్ఱాల వెనుక దాస దాసీజనులు ఎడ్ల బండ్లపై శిబికలపై వచ్చినారు. వీని అన్నింటికి ముందు భజంత్రీలు, నాదస్వర మేళము నడుస్తున్నది. వందులు గుండయప్రభువు బిరుదావళులు చదువుతున్నారు. అంగరక్షకసైన్యం ముందు, ప్రక్కల, వెనుక నడుస్తున్నది. రాజవీధులు బళ్ళతో, గుఱ్ఱాలతో, ఏనుగులతో, శిబికలతో, స్యందనాలతో నిండి ఉన్నవి. రాచవారు ఎవరు వెడుతున్నా అది ఒక ఊరేగింపే !

అక్కలవాడ, భోగంవీధి, స్వర్ణకారవీధి, శిల్పకారులవీధి అన్నీ పురంలో ఉన్నాయి. కోటనగరంలో ఉన్న గుళ్ళల్లో ఎప్పుడూ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. చక్రవర్తుల దుర్గనగరానికి ఎదురుగుండాఉన్న రాజవీధిలో కొంతదూరం పోయిన తర్వాత సార్వభౌమ చిత్రశాల, గ్రంథాగారము లున్నాయి. నగరిలో సార్వభౌమ సౌధాలలో ఒక్కొక్క మహాభవనంలో ఒక్కొక్క చిత్రశాల ఉన్నది.

మాండలికులు చిత్ర, నృత్య, గ్రంథశాలల తమతమ నగరులలో ఉంచుకొనేవారు. మల్యాలవారి నగరిలో ఉన్న చిత్రశాల దేశప్రసిద్ధమైనది.

అన్నాంబిక ప్రయాణపు బడలిక తీరునట్లు సుగంధాలు కలిసిన వేడి నీట జలకమాడి శుభ్రవస్త్రాలు ధరించి సుగంధతై లదీపాలతో స్వర్గలోకంలా