పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాంబిక

71

గజదొంగ గన్నారెడ్డి ఆదవోని రాజకుమారికను ఎత్తుకుపోతాడు! మీరునాతో రావడానికి సందేహించ నక్కరలేకుండా మా అక్కగారు శ్రీ మల్యాల కుప్పసానమ్మ దేవినికూడా తీసుకువచ్చాను. ఆమె సపరివారంగా ఆదవోనిపురం బయట మిమ్ము హృదయానికి అదుముకోడానికి సిద్ధంగా ఉన్నారు.

“మహారాజా! మీరు నన్ను ఎట్లా తీసుకువెళ్ళగలరు? మా తండ్రిగారు ఈ నగరం యావత్తూ చీమదూరరాని కట్టుదిట్టాలు చేశారు!”

“అన్నాంబికాదేవీ! దొంగ ఇంటికి కన్నంవేసినప్పుడు పారిపోయే సావకాశాలన్నీ కల్పించుకొనే వస్తాడు. అందులో నేను గజదొంగను!”

“ప్రభూ! నేను మీతో రానుకాని కుప్పాంబికాదేవిని కలుసుకుంటాను. మార్గం ఉపదేశించండి.”

“మంచిది దేవీ.”

గోన గన్నారెడ్డి తన్ను ‘దేవి!’ అని సంబోధించగానే అన్నాంబిక గుండె గుబగుబలాడింది. ఏదో ఆనందం ఆమెను అలమివేసింది. మోము ప్రపుల్లమై పోయింది.

“మీరు మీ అంతఃపురంలోకి వెళ్ళగానే, సంపూర్ణకవచధారులైన బాలకుని వేషం వేసుకొని, మోమంతాకప్పే శిరస్త్రాణం ధరించుకోండి. ఈ నా ఛురికను చేతదాల్చి, దానితో వీధులలోకి వచ్చేయండి. వీధులలో కాపలా తిరిగే సైనికులలో ఎవరైనా ఎఱ్ఱపట్టు కాసెకోక ధరించుకొన్నవారు మీదగ్గరకువచ్చి ‘గన్నారెడ్డి కనపడ్డాడా’ అని అడిగితే, ‘ఆ గజదొంగా!’ అని మీ రనండి. అతడు ‘ఆ గోన వంశంలోని హాలాహలమే’ అంటాడు. మీ రాతని వెంట వెళ్ళండి. మా అక్క గారిని కలుస్తారు” అంటూ గోన గన్నారెడ్డి ఒక్క ఉరుకున పూలపొదల్లో మాయ మయ్యాడు.

అన్నాంబిక తొందరిగా అంతఃపురంలోకి వెళ్ళిపోయింది.

తమరాజకుమారితో మాట్లాడుతూ ఉన్న పురుషుడు గన్నారెడ్డి అని, అప్పుడే ఆకాశంపై విహారానికి వచ్చిన చంద్రకాంతిలో, సాయం మసక మసక కాంతుల్లో దూరదూరాన ఉన్న చెలులు ఆనవాలు కట్టలేకపోయారు.

ఎవరా ఈ పురుషుడు, నిర్భయంగా శుద్ధాంతవనానికివచ్చి చిన్నదొరసానమ్మగారితో మాట్లాడుతున్నాడు! అని వా రాశ్చర్యమందినారు. ఇది మాయగా ఉన్నది అనుకొని, రాజకుమారి లోపలికి పరుగెత్తుకొనిపోగానే వారును లోనికి పరువిడినారు.

ఎచ్చటను రాకుమార్తె కనపడలేదు. నగరికి ముందున్న ప్రాంగణమందు ఉన్న ద్వారరక్షకుల్ని అడిగితే వా రొకబాలుడు వెళ్ళినాడనీ, ఆ బాలకుడు రాజకుమారి చేతిముద్ర చూపించాడనీ, ఆ బాలకుని తాము పోనిచ్చామనీ వారు తెల్పారు.