పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాంబిక

61

అయినా కోటారెడ్డి తోటిమండలేశ్వరుని తనయునకు ఆ దివ్యశారద అన్నాంబికను ఉద్వాహం చేయ సంకల్పించాడు. కోటారెడ్డి ఆ బాలిక హృదయం ఏమి అర్థం చేసికోగలడు?

శ్రీ గణపతిదేవ చక్రవర్తి తన బాలికనే రుద్రదేవునిగా పెంచినాడని ఏలా ఊహించాడో, అలాగే తాను తన కుమార్తెను బాలునిగా పెంచాడు, అక్కడ శివదేవయ్య మంత్రి ఇక్కడ ఏడీ? తోడి ప్రభువులు నవ్వుతున్నారని అనుకున్నాడు. తన తనయమీద నిష్కారణకోపం వహించి ఎందుకో మండిపోయినాడు.

అత్యంతపాపం చేసుకొన్నవానికిగాని బాలికలు జన్మించరట, అందులో, బాలురు కలుగకుండా ఒక్క బాలికలే ఉద్భవించినవాని జన్మరౌరవాది నరక హేతువట, కోటారెడ్డి ధర్మశాస్త్రం అతని హృదయంలోంచే జన్మం పొందింది! ఆ ధర్మాన్ని పాలించే ప్రభువు ఆయనే! ఒక్కొక్కనాడు తన ఒంటి కూతును చూస్తే ఆదవోని ప్రభువుకు అపరిమిత ప్రేమ. ఒక దినం పుత్రికను, పురుషవేషంతో ఉండేదినాల్లో, తనతోపాటువచ్చి అర్ధసింహాసన మెక్కి రాజకార్యాలలో పాల్గొను మనేవాడు. మరొక్క దినాన, ‘నీవు బాలుడవై ఎందుకు పుట్టలేదు అన్నమదేవి! దుస్తరమైన నీ విధిని నేను దాటప్రయత్నం చేయడమేమిటి?’ అనేవాడు.

అన్నమదేవికి వరదారెడ్డి సాహిణిని వివాహమాడ ఇష్టంలేదని కోటారెడ్డికి దేవేరి స్పష్టంగా తెలియజేసిన సమయంలో అవు ననుకొన్నాడు. మళ్ళీ శుభముహూర్తము నిశ్చయంచేస్తున్నాము అని లకుమయారెడ్డి వార్తనంపగానే శుభ మనుకొన్నాడు.

“చిన్నబిడ్డలకు ఇష్టానిష్టములేమిటి? అన్నాంబిక ముక్కుపచ్చలారని కసుగందు. మంచీ చెడ్డా ఆమె కేమి తెలుస్తుంది? మహారాణి తనకు అన్నాంబిక ఒకర్తే సంతానం కనుక చిన్నతనాన్నుంచీ అల్లారుముద్దుగా పెంచుకొంది. అందువల్ల ఆ బిడ్డ ఏమంటే తానూ అదేఅంటుంది. రాచరికపు విషయాలు ఆడవారి కేమి తెలుస్తాయి?” అని వందిభూపాలు డన్నాడు. పాపం అంతదిట్టమైన వీరుడై కూడా అలా గన్నారెడ్డి చేతుల్లో హతమారిపోయా డేమిటి? కందవోలంతా బట్టుకొని ఆ పాపి రాజ్యం సాధించాడు: కోటంతా బాగుచేయించాడు. మహావీరుడు ఉప్పల సోమప్రభువు గన్నయతల తెస్తానని ప్రభులోకంముందు అన్నమాటలు ఎదురుతిరిగి అతని తలనే గన్నా రెడ్డి పాదాల ముందు పడవేయించాయి.

ఆ ప్రభువు శవాన్ని మంచిగంధపు పేటికలో ఆయన రాజధానికి సగౌరవంగా పంపాడట, ఆ గజదొంగ, ఆ పరమపాపికి గౌరవంచేయడం కూడా తెలుసునా? వాడుకదా పీటలమీది పెళ్ళి చెడగొట్టినాడు. వాణ్ణి, వాడి తమ్ముణ్ణి వివాహ సభామందిరంలోనే స్తంభాలకు కట్టి వివాహం వైభవంగా చేయాలి.