పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవి

39

రుద్ర : మీరు నాకీ రాజనీతి చిన్నతనంలో బోధించినారు.

శివ : అలాంటప్పుడు నేనువచ్చి మళ్ళీ పాఠాలన్నీ జ్ఞాపకంచెయ్యాలా కాకతీయప్రభూ!

రుద్ర : మా నాయనగారికి మగపిల్లలు లేకపోవడంవల్ల నేను బాలిక నైనప్పటికి నన్ను బాలునిగా పెంచారు.

శివ : చక్రవర్తికి తమ్ములన్నాలేరు. ప్రతాపరుద్ర చక్రవర్తికి ఉంపుడు కత్తెకు పుట్టిన సారంగధరదేవునకుమాత్రం ఇద్దరు పుత్రులు హరిహర, మురారిదేవు లున్నారు. వాళ్ళ కీ రాజ్యం కబళించాలని ఉన్నది. ధర్మసంరక్షణార్థం ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కరాజే ఉండాలి. మన తెలుగు మహాసామ్రాజ్యము అనేక చిన్నచిన్న రాజ్యాలుగా ముక్కలై ఉంటే ధర్మసంరక్షణం జరగదు. ఈ రాజ్యం కోసల విషయమనీ, కళింగమనీ, వేంగీవిషయమనీ, నతవాటిసీమ, గృధ్రవాడ విషయము, మంజిష్ఠదేశము, కమ్మనాటి విషయమనీ, వెలనాడనీ, ఆరు వేలనాడనీ, వూగీవిషయమనీ, పొత్తపినాడనీ, సింధనాడనీ, మార్జనాడనీ, మానువ నాడనీ, కొరవదేశమనీ, కొలనిపాక విషయమనీ, చక్రకోట్యమనీ, మంత్రకూట విషయమనీ ఈ విధంగా చిన్నచిన్న రాజ్యాలతో నిండిఉన్నది. వీని నన్నిటినీ ఏకచ్ఛత్రంక్రిందికి తీసుకువచ్చి, సుఖరాజ్యం స్థాపించి, ధర్మపరిపాలనచేస్తూ, శాంతిభద్రతల నెలకొల్పి పురుషార్థాలు వెల్లివిరిసేటట్లు చేయవలసిన బాధ్యత మహా పురుషులది! చాళుక్య రాజ్యాలు రెండూ నాశనం అయ్యాయి. ఆ తర్వాత మీ పెద తాతగారైన రుద్రమహారాజు తండ్రి ప్రోలమహారాజులు కాకతీయసామ్రాజ్యం స్థాపించారు. చాళుక్యులు బలవంతులుగా ఉన్నంతకాలం, శ్రీ ప్రోలమహారాజు తండ్రి శ్రీ భేతమహాప్రభువు వారికి నమ్మకంగల మండలేశ్వరుడై సామంతుడై ఉండెను. భేతమహారాజు తండ్రి శ్రీ ప్రోలమహారాజు, వారితండ్రి భేతమహారాజు మహామండలేశ్వరులై, సామంతులై ఉండిరి.

గణపతి : తండ్రీ! నాకు పుత్రులు కలుగలేదు. ఇందరి రాణులలో ఒకరి గర్భమూ ఫలించలేదు. స్వయంభూదేవుడు ప్రసాదించిన శక్తితో, ఈ దేశికుల సహాయంతో కాకతీయ సామ్రాజ్యము వృద్ధిచేసి దేశంలో ధర్మం నెలకొల్పాను. ఆలాంటి ఈ మహారాజ్యానికి యువరాజు లేడు. తల్లీ! నువ్వు పుట్టడమే హిమవంతుని ఇంట పార్వతి జనియించిన ట్లయింది నాకు. చిన్నవారైనా నాకు పంచాక్షరి ఉపదేశించి అర్జునునికి సారథ్యం చేసిన శ్రీకృష్ణునివలె ఈ శివదేవయ్య దేశికులు నువ్వు ఉద్భవించగానే నాకు పుత్రులు పుట్టబోరనీ, నీ జాతకమునందు మహాసామ్రాజ్ఞీత్వము వ్రాసిఉన్నదనీ చెప్పి పుత్రుడుదయించు కట్టుదిట్టాలు చేయించారు.

మహారాణి : తల్లీ నిన్ను పుత్రునిగా పెంచడం ఎంత కష్టమైంది? చక్రవర్తీ, మహామంత్రీ ఆలోచించి చేసిన ఏర్పాటిది.