పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవి

33

అంగరక్షకులు మహాసౌధప్రాంగణంకడ యువరాజు సెలవంది చెరియొక వైపూఉన్న వారివారి భవనాలకు వెళ్ళిరి.

రుద్రదేవి ప్రాంగణందాటి బాహ్యచతుశ్శాలదాటి అభ్యంతర సౌధప్రాంగణాల గుఱ్ఱం దిగి, గుఱ్ఱాన్నితట్టి, సేవకులు పట్టుకొనివచ్చిన తాటిపటిక బెల్లం గడ్డలు తినిపించి ఆ యుత్తమాశ్వంకడ సెలవుపొంది, లోనికి వెళ్ళిపోయింది.

ఆ సౌధబాహ్యమందిరాలలో కావలి ఉండునది పురుషుడు. పనిపాటలు సలిపే దాస్యజనులిచ్చు సాష్టాంగ దండప్రణామాలు అందుకొంటూ అభ్యంతర మందిరంలోకి సాగిపోయినది రుద్రదేవి.

అభ్యంతర మందిరాలలో కాపుండేవారందరూ స్త్రీలే. దాసీజనులు దారి చూపిస్తూఉండగా, వైతాళికులు బిరుదులు చదువుతుండగా ప్రభువు అలంకార మందిరంలోకి వెళ్ళినారు. అలంకార శయన మందిరాలలోకి అతి నమ్మకంగల ఇరువదిమంది దాసీలు, ఇరువదిమంది అంగరక్షకులు, ఇరువదిమంది చెలిమికత్తెలు తప్ప ఇతరులెవ్వరూ వెళ్ళడానికి అధికారంలేదు. ఆ అభ్యంతరాంతర మందిరముల లోనికి యువమహారాజు తల్లులు, మహారాణులుకూడ అనుమతిలేనిదే రావీలులేదు; యువమహారాజు భార్య శ్రీ శ్రీ ముమ్మడాంబికకును అధికారములేదు.

రుద్రదేవ ప్రభువు అభ్యంతరాంతరాలంకారమందిరములలోనికి పోయి, ఒక పీఠముపై అధివసించగానే దాసీలు పరుగున వచ్చిరి. వారిలో ముగ్గురలంకారిణు లుండిరి. ఒక ఆమె శిరస్త్రాణం, గొలుసులవస్త్రం తీసి పక్కదాసీకి అందిచ్చింది. ఒకామె కవచకంచుకము విప్పింది. మరొకతె పాదరక్షకులు ఊడ్చింది. వేరొకతె నడుముకు ధరించిన రత్నాలుపొదిగిన బంగారు మొలనూలు విప్పినది పట్టుదట్టీ తీసినది. అందున్న మణులు పొదిగిన దంతపు పిడిగల రత్నాల ఒరగల చురకత్తి తీసింది.

అప్పు డొక చెలి వచ్చి ఆమె దీర్ఘ వినీల కుంతలాల ధమ్మిల్లము విప్పి దంతపు దువ్వెనతో దువ్వ నారంభించినది. ఒకబాలిక ఆ యువరాజు పురుషాభరణాలన్నీ ఒలిచినది. స్తనవల్కలముతో ఆ దివ్యసౌందర్యగాత్రి అపరాజితాదేవివలె ఒప్పినది. ముచ్చెలు తొడుగుకొని, యా కాకతీయకుల రాకాచంద్రిక స్నానమందిరానకు నడచినది. ఆ పాదాల గమనిస్తూ మార్జనిక లిద్దరు ఆమెతో నడచు చుండిరి. ఆమెపాదాలు కమలాల మొగ్గలే, ఆమె పాదాలు పావురాలజంట, ఆమె పాదాలు పాలసముద్రంలో కెరటాల తాకుడువల్ల ఏర్పడిన అమృతంపు వెన్న ముద్దలు అని మార్జవికలైన ఆబాల లనుకున్నారు.

సుగంధతైలాలు పూసి, పరీమళపు నలుగులు నలిచి, సురభిశోష్ణోదకాల స్నానంచేయించా రా బాలలు. స్త్రీ దిగంబరియై స్నానమాచరించాలట. రుద్రదేవి చక్రవర్తి నియంత్రణవల్ల బాలుడౌట కటివస్త్రంతో స్నానం కావించినది.