పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవి

31

కాండ్రు, సైనికులు, బోయమన్నీలు, కోయదొరలు రుద్రదేవమహారాజున్న కడకు వచ్చారు.

అందరూ కలిసి అక్కడ దగ్గరఉన్న తమకు విడుదులు ఏర్పరుపబడిన ఒక పల్లెకు వేంచేసినారు. ఆ విడుదులలో తాటియాకుల గుడిసెలలో యువమహారాజును శ్రీ చాళుక్య వీరభద్రప్రభువు రక్షించిన సరిఘటననే చెప్పుకొనుచుండిరి.

“ఆ పెద్దపులి ఎక్కడనుంచి వచ్చింది?”

“ఆకాశంనుంచి ఉరికినట్లు వచ్చింది.”

“మనవా ళ్ళెవ్వరూ ఆ వైపు కాపు ఉండలేదు. ఆ వైపునుంచే అంత ఠీవిగా నిర్బయంగా నడిచివచ్చింది,”

“ఎదురుగుండా మహారాజులు కనపడ్డారు. గాండ్రుమని అ పెద్దపులి వారి మీద ఉరికింది. బాణాలు ఎక్కు పెట్టేవ్యవధిలేక కత్తి దూశారు వారు. ప్రక్కనే ఉన్న వీరభద్రమహారాజులు పెద్దపులిపై సువ్వున బాణంవేస్తే అ పెద్దపులి ఒక దొర్లుదొర్లి పడింది.”

“అవును ! మళ్ళీ చెంగునలేచి వీరభద్రమహారాజుపైన దుముకబోతే కళ్ళ మధ్యనుంచి దూసిపోవ నేశాడు బాణం.”

ఈవిధంగా విడుదు లన్నిటిలో మహారాజును రక్షించినందుకు చాళుక్య భూపతిని పొగడినారు. గండం తప్పినందుకు భగవంతుని ప్రార్థించారు.

ఇంతలో ఎక్కడనుంచో ప్రసాదాదిత్యనాయనివారు సంరంభంగా ఊడి పడ్డారు. ఆయన శ్రీ రుద్రదేవమహారాజులకు నమస్కరించి “ప్రభూ ! నేనూ తమతో వేటాడాలని అంచెలలో వచ్చాను” అని మనవిచేశాడు. రుద్రదేవప్రభువు తమ తండ్రిగారైన సార్వభౌమునిగురించి అడిగినారు. ఆ వెనక యువమహారాణి ముమ్మడమ్మనుగూర్చి అడిగినారు. ఇదివరకే రుద్రదేవమహారాజు తల్లి శ్రీ సామ్రాజ్ఞి సోమాంబాదేవి అస్తమించినది. సవతితల్లులైన మహారాణులనందరినీ కన్నతల్లి కన్న ఎక్కువగా ఆయన ప్రేమించేవారు. వారందరినీ గూర్చి ప్రభువు ప్రసాదాదిత్యుని అడిగినారు.

ప్రసాదాదిత్యప్రభువు రెండు దినాలు వేట ఆనందాన్నిపొంది, అక్కడ నుండి రుద్రప్రభువుతో కలిసి ఓరుగల్లు ప్రయాణమయ్యెను.

కాకతీయ మహారాజులు, వారి సామంతులు ఆంధ్రభూమిలో అనేక మహా సరోవరాలు నిర్మించారు, వ్యవసాయం వృద్ధిచేశారు.

వీరి ప్రయాణంలో అనేకమగు చెరువులు, గ్రామాలు చూస్తూ ప్రయాణం చేశారు. తమ భావిచక్రవర్తి యువరాజు శ్రీ రుద్రదేవులు వస్తున్నారని గ్రామాలకు తెలియగానే ప్రజలు ఉత్సవాలతో ఎదుర్కొనేవారు. పళ్ళు, పూవులు, కూరగాయలు, బలిసిన మేకపోతులు, పోతరించిన కోడిపుంజులు, ముత్యాలులా మిల