పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవి

29

ఆంధ్రులు అశ్వవీరులు కాబట్టే వారిలో అశ్వసాహిణు లెక్కువ. అశ్వ శాస్త్రం తెలియని ఆంధ్రవీరుడు లేనేలేడు. అరబ్బులకు గుఱ్ఱాలన్న ఎంత ప్రీతో ఆంధ్రులకూ అంతప్రీతి. రుద్రదేవి అశ్వసాహిణులలో మహోత్తమ సాహిణి. ఆ నా డామెను అశ్వశిక్షలో మించిన పురుషుడు ఒక్క గోన గన్నారెడ్డిమాత్రమే!

రుద్రదేవిని ప్రేమించని గుఱ్ఱంలేదు. చక్రవర్తి అశ్వశాలలో ఆమె అడుగుల చప్పుడుగూడ ప్రతిగుఱ్ఱమునకు తెలియును.

2

"ఓహోహో! చాళుక్య వీరభద్రప్రభు వెంత యందగాడు! ఎంతటి వీరుడీయన! ఆయన ఘనముష్టివినిర్ముక్తశరము ఇనుపకుడ్యాలనైన భేదించుకుపోగలదు గాబోలు. ఆ పెద్దపులికళ్ళమధ్యనుంచి మెదడులోకి సువ్వున దూసిపోయింది. ఒక్క ఏటుతో గిఱ్ఱున తిరిగి, ఆ అటవిరాజు నేలకూలింది. ఈ ప్రభువెంత చదువుకొన్నాడు. ఎంత శాంతము! ఏ విషయములోనూ చెక్కుచెదరడు. కోపము వీరి జీవితములో ఎప్పుడైనా వచ్చునా? కాని, పనిపట్టినప్పుడు మెరుమువేగాన్ని తాంబేలువేగంలా కనిపింపజేయగల అఖండవేగం! ఉత్తమధర్మం అంతా ఈయనలోనే మూర్తమై ఉందా! ఎంతటి మహాపురుషుడు! సింహంలాంటి బలం కలవాడు, సింహాలను కుక్కులవలె తోలగల విక్రమంగలవాడు” అని రుద్రదేవి ఆలోచనలో చిక్కి తలవాల్చి వాలుగన్నులతో అపాంగవీక్షణాలు పరపుచు వీరభద్రప్రభువును గమనించింది.

అప్పు డా దేవి స్త్రీయైపోయినది. ఆమె కేదో వివశత్వం కలిగింది. తానిట్లా శిఖండివలె ఉండడమేనా? పురుషునికి స్త్రీ వేషంతో ఉండడం ఎంత అసహ్యమో స్త్రీకి పురుషవేషంతో ఉండడమూ అంత భరింపరానిదే! ఆమె జఘనఘనత్వ మేమగును? ఆమె పురుషవేషంలో చిన్న బాలుడుగా కనిపిస్తుంది. ఆమె తొడలు తమ రంభాత్వాన్ని పురుషవేషంలో మాయం చేసుకోలేవు. పర్వతసానువువలె కర్కశమై, సౌందర్యవంతమై గంభీరమైన విశాల ఫాలంతో, రక్తపుజీరలు నిండిన విశాలమైన కన్నులతో వెరగుగొల్పే పురుషులమోములోని పారుష్యము, నున్నగా చంద్రబింబంలా, నిశ్చలమైన చెరువునీటిలా, నీటిలోతేలు తామర పూవులా, తామరపూవులోని రేకలా, లేత జేగురు చిరుగులప్రోవులా, ఉదయంలో మంచుతో తడిసిన కాశ్మీరకుసుమపు చేనులా - లాలిత్యాలు మూటలు కట్టే స్త్రీ ముఖంలో పురుషవేషం వేసినా ఎల్లా వస్తుంది?

కాని ఈ మహాభూమి, శాలివాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు, కాకతీయులు ఏలిన ఈ పవిత్రమహాంధ్రభూమి తాము రాజ్యం చేయకపోతే విచ్ఛిన్నమై