పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాయికానాయకులు

317

ఎవ్వరీ సొబగులాడు! ఎక్కడో చూచినట్లున్నది. ఆదవోని సేనాపతులు, ఆదవోని రాచకుటుంబాలవారు, ఆదవోని ఉద్యోగులు అందరూ ఆ యువకుని ఎక్కడో చూచితిమనే అనుకుంటున్నారు.

ఎవరయ్యా ఈ ఉద్దతసత్వుడు! ఆయన ధరించిన కిరీట కేయూరాది లాంఛనాలున్నూ ఇదివరకు చూచినవే. నవ్వులు పూర్ణజ్యోత్స్నలులా వెదజల్లే ఆతని మోము పరిచితమైనదే! ఎవరోహో ఈ సుందరకుమారుడు!

అంతలో ఎవరో “అతడు గోన గన్నారెడ్డి” అన్నారు. “గోన గన్నారెడ్డి చక్రవర్తి ముఖ్యాంగరక్షకుడుగా వచ్చాడు. గోన గన్నారెడ్డి, గోన గన్నారెడ్డి గజదొంగ!” అన్న గుసగుసలు పట్టణమంతట ప్రాకిపోయెను.

“గోన గన్నయ్యే” ఆ మాట విద్యుల్లతలా వాడవాడలూ, భవనాలు, సౌథాలు, నగరులు, అంతఃపురాలు ప్రాకిపోయింది.

తన అంతఃపురప్రాంగణంలో అన్ని ఉత్సవవిధానాలు సంసిద్ధం చేసుకొని సముచితాలంకారదివ్యశోభనమూర్తియై, అర్థచంద్రాభిఫాలయై, తిలపుష్పసమానాసయై, దీర్ఘ వినీలపక్ష్మాచ్ఛాదితవిశాలనయనయై, నర్తిత మందహాసచంచల మధురపక్వబింబాధరోష్టియై, వేగంతో పరువులెత్తే గుండెలతో నిలుచునిఉన్న అన్నాంబికకడకు ఒక రాకుమారి వేగపునడకలతో వచ్చి ‘వదినా, గోన గన్నా రెడ్డి వచ్చినాడట’ అని చెప్పినది.

“ఏమిటీ! గోన గన్నారెడ్డి......గోన.... గో......గో.....న గన్నారెడ్డి!” అనే మాటలు ఆమె నోటనుండి వచ్చినవాయెను.

ఆమె ఒక్కసారిగా వివశత్వం పొందెను. ఆమెకాళ్ళలో బలము కరగి పోయెను. ఆమె గుండె కొట్టుకొనుట ఒక్కనిమేషము ఆగిపోయినది.

ఏలావచ్చా డా దివ్యపురుషుడు? ఎందుకు వచ్చా డా ఉత్తమ నాయకుడు? అయ్యో! ఏమహారాజు కోపానికి గురి అయ్యాడో, ఆ మహారాజు నగరానికే ఎందుకు వచ్చాడు?

తన గురువు, తన హృదయసింహాసనాధినేత, తన స్వప్నాంకిత మధుర నాయకుడు, తన దైవము తనకడకే వచ్చినాడా!

గంభీర మృదుమధుర కంఠస్వరాలతో తన్ను ‘విశాలాక్షప్రభూ’ అని పిలిచిన వన్నెకాడు!

మేటి సింహాల పూలచెండులా నాడగల పోటుమానిసి, సింహావలోకనంతో ఆంధ్రదేశం పాదాక్రాంతం చేసుకోగల వీరుడు, సర్వధర్మవిరాజిత ధీరోదాత్తుడు, కుమారస్వామి సన్నిభ సుందరుడు!

గోనవంశకలశాంబోధిరాకాసుధాకరుడు, శ్రీకృష్ణ నామాంకితుడు తన్ను వెతుక్కుంటూ వచ్చినాడా?