పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామ్రాజ్యాభిషేకము

309

రుద్ర: అన్నింటికన్నా ఆశ్చర్యమేమిటంటే చిన్నతనంలో గన్నభూపతి నాయకుడు కాగలడని అనుకున్నానుగాని ఇంతటి అతిరథుడవుతాడని అనుకోలేదు. ఏమి వ్యూహాలు! ఏమి యుద్ధం! అర్జునుడు పాఠాలు నేర్చుకోవాలి.

గణ: ఆ బలం, ఆ బుద్ధి, ఆ రూపం! మనకు అన్నగారులేని లోపం ఆయనవల్ల తీరింది.

రుద్ర: అవునుతల్లీ! మనకాయనే అన్నగారు.

తన్నుగురించి ఈలాంటి సంభాషణ జరుగుచున్నదని గన్నారెడ్డికి ఏమి తెలియును? తన నగరిలో రాత్రి భోజనానంతరము ఆయన పర్యంకము పై అధివసించి కనులు మూసుకొని పండుకొని ఉన్నాడు.

ఇంతలో అక్కిన అక్కడకు వచ్చెను.

అక్కి: మహారాజా! కనులు తెరవండి. కనులుమూసికొని పగటి కలలు కనుటకంటె గంధర్వాశ్వాలను అధివసించి ఈ వెన్నెలలో తిరిగివద్దాం రండి.

గన్న: అందుకనే నేను నీకు వార్త పంపానయ్యా బావగారూ!

ఇద్దరూ ఉత్తమాజానేయాల నధిష్టించి ఆ వెన్నెలలో ఓరుగల్లునగరందాటి, వేగం ఎక్కువచేసి ఉత్తరాభిముఖులై మాటలాడకుండా వెళ్ళుచున్నారు.

నాలు గైదు గవ్యూతులదూరం వెళ్ళగానే గుఱ్ఱాలవేగము కుదించి, పిమ్మట ఆపినారు. అక్కడ మామిడితోపులు, ఒక పెద్ద చెరువు, ఒక చిన్న గ్రామం, గ్రామ మధ్యమందు దేవాలయం కనబడుచున్నవి.

ఇద్దరు గుఱ్ఱాల పై వెన్నల్లో ఆ చెరువును, తోటలను, ఆకాశాన్ని నీటిలో ప్రతిఫలాలను, చిరుమేఘాలను, తనచుట్టూ ఆవరించిఉన్న వెన్నెలను గమనిస్తూ వెన్నెల్లో అప్లావితులౌతూ, అలా కదలక మెదలక బొమ్మలులా అయిపోయారు.

అలా వారు నాల్గయిదు ముహూర్తములకాల మున్నారు. ఆ వెనుక నిట్టూర్పు విడుస్తూ గోన గన్నారెడ్డి గుఱ్ఱమునుండి దిగి, కళ్ళెము గుఱ్ఱపుమెడపై విసరివేసి గుఱ్ఱాన్ని బుజంతట్టి, ‘గజదొంగల ఎకిమీడా! తిన్నగా ఆహారం మేసుకో, ఆ గడ్డిలో నీకడుపు నిండినంత; వెన్నెలతో నిండిఉంటుంది, దాని రుచి నీకే తెలుస్తుంది’ అని వదలినాడు.

“నా గుఱ్ఱానికి వెన్నెల అక్కరలేదయ్యా. ఇంత పచ్చిదనం ఇంత రసపూర్ణత ఉన్నగడ్డి కావాలిగాని!”

గన్నా: అవును. నా గుఱ్ఱం గంధర్వాశ్వమే!

అక్కి: రెక్కలేవి?

గన్నా : నీబోటి మానవులకు అవి కనపడవు!