పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

211

మంత్రితో వివిధోద్యోగులతో, సర్వనాడులగూర్చి; ప్రజలగూర్చి మోటుపల్లి శ్రీకాకుళం, మచిలీపట్టణము, శంబరదీవి, కుదంగేశ్వరపురం మొదలైన రేవుపట్టణాలనుండిజరిగే సముద్రవ్యాపారాల గురించి, సుంకాలు, రాజభోగము, పన్నులు, కప్పాలు, అడవులు, గనులు, వర్తకము, నాణేలు మొదలైన ఆర్ధికవిషయాలగురించి; వానలు, నదులు, చెరువులు, కాలువలు, పంటలు, తోటలు, వ్యవసాయము, గ్రామాలు, పశువులు మొదలగు ప్రజాజీవనం గురించి; గ్రామపెద్దలు, దళ గ్రామాధికారులు, సామంతులు, మంత్రాంగులు మొదలయిన రాజ్యపాలనా నీతినిగూర్చి; మహారాజ పథాలు, సత్రాలు మొదలైన సంస్థలగూర్చి; వైద్యశాలలు, పశువైద్యశాలలగూర్చి, విద్యానిలయాలు, ఆశ్రమాలు, పరిషత్తులు, దేవాలయాలు, శాసనాలు, మఠాలు, వివిధ సంప్రదాయాలు, మతాచార్యులు మొదలయినధార్మికవిషయాలగూర్చి; కవులు, పండితులు, శిల్పులు, గాయకులు, గ్రంథాలు, సరస్వతీ ఆలయాలు, నాట్య కోవిదులు, భోగమువారు, శిల్పబ్రాహ్మణులు మొదలైన మహావిద్యలనుగూర్చి ఆ సామ్రాజ్ఞి సంపూర్ణంగా చర్చించుచు తానే అన్నికార్యాలు నిర్వహింపసాగింది.

అన్నిటిలో అన్నాంబిక ఆమెకు మంత్రి, సేనాపతి, తంత్రపాలిక, తలవరి, అంగరక్షక, తోడునీడయై మెలగుచుండెను.

అన్నాంబిక ఒక్కొక్కప్పుడు ‘ఇదేమిటి, పురుషులు నిర్వర్తించే ధర్మము తాము నిర్వర్తించడ మేలాగు? అది ఎలా విజయం పొందగలదు?’ అని సంశయముచే వ్యధనొందేది. ఒక్కొక్కప్పుడు తన మహారాణి అవతారస్వరూపిణి, కారణజన్మ, దేవీమూర్తి కాబట్టి అపరాజితాదేవిలా లోకం యావత్తూ రాజ్యం చేయగలదని సంకోచరహితమైన ఉత్సాహంతో ఉప్పొంగిపోయేది.

పురుషవేషంలో వా రిద్దరూ రామలక్ష్మణులు లయ్యారు. వరాహలాంఛన యుతమై, ఖడ్గధారిణియైన దేవీమూర్తి విగ్రహంతో, రుద్రదేవి అన్న అక్షరాలతో ముద్ర ఒకటి సామ్రాజ్ఞి అనామికను, మరొకటి అన్నాంబికవ్రేలిని అలంకరించాయి.

అశ్వసైనికులు ఒకరొకరు, ఇరువురిరువురుగా, మూవురుగా, నలుగురుగా, ఇరువదిమంది, వేయిమందిగా చెక్కుచెదరక శ్రేణులుగా యుద్ధయాత్రకు పురోగమించడం, యుద్ధంలో విరోధుల్ని తాకడం ఆమె నేర్పి సేనల సుశిక్షితము లొనర్చెను.

ఢంకానాదాన్ననుసరించి పదాతులు మొదట వరుసతీర్చడం, ముందుకురకడం, డాలు డాలు కలిపి గోడకట్టడం, డాళ్ళు గొడుగులుచేసి నడవడం, ఒక శ్రేణివెనుక ఒక శ్రేణిగా మోహరించడం; మోహరంలో కరవాల భల్లశూల పరశు యుద్ధాలు చేయడం; యెదుర్కొన్న సైన్యాలపై బడడం; పరు