పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

గోన గన్నా రెడ్డి

“యాదవమహారాజు దేవగిరి కృష్ణభూపతి వృద్ధుడైనాడు. ఆయన కుమారుడు యువరాజు ఆంధ్రదేశముపై కన్నువేసి ఉంచారు. బద్ధశత్రువులైన ఆంధ్రుల రాజ్యము యావత్తూ కబళించి తానే సమ్రాట్టుఅయ్యే ప్రయత్నాలు చేస్తూవున్నాడని వేగు” అని సేనాధిపతి కామయరెడ్డిసాహిణి వాక్రుచ్చాడు.

ఆదవోని వర్ధమాన మండలేశ్వరులకు రాయబారాలు జరిగినవి. సంబంధము నిశ్చయమయింది. ఇద్దరు ప్రభువులు కందవోలు ప్రభువును, ఇందునగర మహామండలాధిపతియున్నూ చేరి యాదవయువరాజు మహాదేవరాజుకు శ్రీ గణపతి రుద్రచక్రవర్తి లింగైక్యంకాగానే వేగుపంపించి రప్పించుటకున్ను, రుద్రాంబను తక్తుమీదనుండి లాగివేయుటకున్ను, యాదవుడు తన రాజ్యం చేరగానే వీరందరున్నూ తిరుగబడి స్వతంత్రం అనుభవించుటకున్ను ఏర్పాటు చేసికొన్నారు.

వృద్ధుడైన లకుమయారెడ్డిప్రభువు పూనిన పనిని అతి పట్టుదలతో నిర్వహింపగలిగే సాహసి. రహస్యంగా చారులను పంపి, ఓరుగల్లులో సైన్యాల విషయము వేగు తెప్పించుకున్నాడు. ఓరుగల్లును దేవగిరి యాదవదేశ మహారాజు ముట్టడిస్తే కోట ఏదెస నీరసంగా ఉండును, ఎక్కడనుంచి ముట్టడి సాగింపవచ్చును అనే విషయాలు పూర్తిగా తెలుసుకున్నాడు.

రహస్యాలోచనమందిరంలో అతడు ముఖ్యసచివునితో, సేనానితో మంతనం జరిపే సమయంలో లకుమయాధీశుని ముఖ్యచారులలో ఒకడు ప్రభువు అనుమతితో లోన ప్రవేశించి మహారాజుకు సాష్టాంగ నమస్కారములు చేసినవా డాయెను. ఆ తరువాత మహారాజుం గనుగొని “మహాప్రభూ! హరిహరదేవ, మురారిదేవుల ఆప్తసచివులు మారయమంత్రులు వచ్చి మహారాజు ఆజ్ఞకోసం నిరీక్షిస్తున్నారు” అని విన్నవించాడు.

2

మారయమంత్రి రహస్యాలోచన మందిరంలోకివచ్చి, ప్రభువు లకుమయారెడ్డికీ, మంత్రులకూ నమస్కారంచేసి ఆసనమం దధివసించెను.

“మహారాజా! మా ప్రభువులు హరిహరదేవుడు, చిన్నప్రభువులు మురారి దేవులు, పరు లెరుగకుండానున్ను, అసాధ్యులైన ప్రసాదాదిత్యనాయకులు ఏమాత్రమూ గ్రహింపలేకుండా ఉండేటట్లుగానూ, శివదేవయ్యమంత్రిగారి దూర శ్రవణాది మాయోపాయాలకు చిక్కకుండా ఉండేటట్లుగానూ సర్వ సన్నాహాలు చేస్తూఉన్నారు” అని మారయమంత్రి మనవిచేశాడు.