పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

187

పంచాక్షరి. కామేశ్వరీ, కామేశ్వరీ! శుభముహూర్తంవరకూ నిన్ను ఉదయాస్తమానాలు చూడరాదని బాధ! ఈలోగా ధాన్యకటకం దగ్గర కృష్ణకీవల కొంత కాలం ఉండివస్తాను.

భార్య తనకు నమస్కారముచేయ ఆమెను రెండుచేతుల పైకెత్తి పెన్నిధిని వలె హృదయానికి హత్తుకొని, ఆమె కెంబెదవి పుణికి ముద్దాడి నెమ్మదిగా బయటికేగి ఆ తెల్లవారగట్ల అతడు మూడువేల సైన్యాన్ని నడుపుకొంటూ ధాన్యకటకంవైపు ప్రయాణం సాగించినాడు. అతనికి దారిపొడుగునాచిన్నారి భార్య కామేశ్వరి ముద్దుల మోము ఎదుట ప్రత్యక్షమవుతూనే ఉంది. ఆమె మోము చంద్రబింబమువలె స్నిగ్ధమైనది. గుండ్రమూ కోల కాని ఆ మోములో ఆ ఫాలం స్వర్ణది. ఆ ఫాలందిగువ కన్నులు ఇందీవరపత్రాలు. ఆ పత్రాలలో నీలి ఆకాశాలు కను పాపలు. ఆమె నాసిక వికసించిన బంగారు చంపకము. ఆమె పెదవులు చిన్నవి. వంపులు తిరిగినవి. క్రిందిపెదవి ఎఱుపు మందార పూ మొగ్గ. పై పెదవి వికసించిన ఎఱ్ఱకలువరేకు. ఆమె అందము వెన్నెల ప్రవాహము, ఆమె అందము సర్వ సంగీత సారము. ఆమెయౌవనము పారిజాత మల్లీకుసుమసంయోగ పరీమళ లహరి.

10

విజయదశమి ఉదయాన్నే, రుద్రప్రభునకు చక్రవర్తి ఆహ్వానం వచ్చింది. రుద్రమదేవి పురుషునివేషం వేసికొని అంగరక్షకులు కొలిచిరా చక్రవర్తినగరి కేగెను.

చక్రవర్తి పూజ చాలించి విద్యామందిరంలో దిండ్ల నానుకొని ఆసీనులై ఉన్నారు. రుద్రదేవి ఆ మందిరంలోనికి ప్రవేశించి వీరమహేశ్వరుడగు తండ్రి పాదాల వ్రాలింది. ప్రేమతో తండ్రి కుమార్తె నాశీర్వదించి తన ప్రక్క కూర్చుండ బెట్టుకొన్నారు.

“బాబూ! మీ యీ సుందరమూర్దంపై ఎక్కువభారం ఉంచాను. అందుకు మీకు కోపంగా లేదుకదా!”

“నాకు తమ ఆజ్ఞ భగవదాజ్ఞకదా మహాప్రభూ! నన్నెరగరా?”

“మా అనంతరం మీరు ఈ భారం ఇంకా ఎక్కువ వహింపవలసి వస్తుంది.”

“తాము ఈభుజాలకు మహాశక్తిని ప్రసాదించారు. ఆ భారం అతి సులభంగా వహించడానికి తగిన రహస్యం శివదేవయ్య దేశికులకు తెలుసును. అయినా తాము నూరేండ్లు ఈ మహారాజ్యభారం వహించి ఉండనే ఉంటారాయెను!”