పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయగాథ

కుట్ర

1

త్రైలింగ మహాసామ్రాజ్యానికి చక్రవర్తియై, మహాజగనాథక్షేత్రం నుండి చిదంబరక్షేత్రం వరకున్నూ శివకేశవులకు అభేదం కల్పించి, తూర్పు సముద్రం కెరటాలు పశ్చిమసముద్రం తరంగాలతో సంగమంచేయించి, సమధిగత పంచమహాశబ్ద, మహామండలేశ్వర, పరమమాహేశ్వర, అనుముకొండపురవరాధీశ, వరనారీసహోదర, ఆదిచోడకటకచూరకార, మన్నియబెండకార, విభవదేవేంద్ర, మూరురాయ జగదాళ, విదితవిక్రమశీల, సత్యహరిశ్చంద్ర, శ్రీ స్వయంభూ దేవర దివ్యశ్రీ పాదపద్మారాధక, వితరణకర్ణ, ఆశ్రితపోషక, శరథిశశౌర్యమందర, పరబలసాధక, ప్రత్యక్షప్రమథగణావతార, లాటకటకచూరకార, కదనప్రచండ, చలమర్తిగండ, చతుస్సముద్రముద్రాధికార్జితకీర్తి, సప్తమచక్రవర్తి, ఆదిరాజ చారుచరిత్ర, సుజనైకమిత్ర, సుస్థిరనిజరాజాన్వయనామాది సమస్తప్రశస్తిసహితులై మహావైభవంగా రాజ్యం ఏలుతున్న శ్రీశ్రీ కాకతీయ గణపతిరుద్రదేవ చక్రవర్తికి వృద్ధాప్యం వచ్చింది.

శ్రీ శ్రీ చక్రవర్తి ఆజ్ఞప్రకారం ఆయన పెద్దకుమార్తెను పురుషవేషంతో మహాసామ్రాజ్యానికి యువరాజుగా అభిషేకంచేసి స్వామికార్యదురంధరులై శ్రీ ప్రతాపనాయనింవారున్నూ, శ్రీ మండలేశ్వర మాణిక్యం, సర్వసేనాధ్యక్షులు మురారినారాయణ. చలమర్తిగండ, గండపెండేర, రక్కెసగంగ, సిద్ధయదేవ, తలగొట్టగండ, గణపతిరుద్రదేవచరణనళిన యుగళ సమారాధన, మాండలిక బ్రహ్మరాక్షస ఇత్యాదిమహాబిరుదాలతో బాహత్తరనియోగి, మహావీరుడు వృద్ధుడు శ్రీ జన్నిగదేవసాహిణి మహారాజులుంగారున్ను, మహామంత్రి అఖండరాజ్య తంత్రజ్ఞుడు, ఉభయభాషల్లో పండితుడు, పురుషార్థసార మహానీతిగ్రంథ నిర్మాత అయిన శివదేవయ్య మహాసచివులవారున్నూ, రాజభక్తిపూరితులైన మండలేశ్వరు లనేకుల సహాయంతో రాజ్యంలో రాజద్రోహంలేకుండా కాపాడుతున్నారు.

శ్రీ గణపతిదేవచక్రవర్తికి పశ్చిమాంధ్ర ప్రతినిధిగా వర్ధమానపురం రాజధానిగాచేసికొని, మానువనాటి విషయానికి గోన లకుమయారెడ్డిసాహిణి మహారాజులంవారు అన్నగారివెనుక ఆయనకుమారునిపరంగా రాజ్యంచేస్తూ చక్రవర్తికి నమ్మకమైనబంటై, చక్రవర్తి సేనల్లో సేనాపతియై, అశ్వసాహిణియై, సమ్రాట్టు ఆజ్ఞాప్రకారం కుంతలదేశంలోనికి సేనల్ని చొప్పించుకొనిపోయి కల్యాణపుర యాదవరాజ్యప్రతినిథుల్ని ఓడించి, వాతాపినగరం పట్టుకొని ఆంధ్రసామ్రాజ్యము