పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

177

దేవమ్మగారి పాదాల బడి క్షమాపణ వేడకుండా, పినతండ్రిని పట్టుకొని ఓరుగల్లుకు బందీగా పంపించి మాత్రం ఊరుకొన్నాడేమిటి?’ అని అల్లుణ్ణి పృచ్ఛ చేసింది.

చిన అక్కినమంత్రి చిరునవ్వునవ్వి ‘అత్తయ్యా! ఏమిటి అట్లాఅడుగుతారు? దొంగలను దొంగతనం ఎందుకు చేస్తావయ్యా అంటే చెపుతారా!’

‘అదికాదయ్యా! నీ అంత చదువుకొన్నవాడు లేడు. నువ్వు మళ్ళీ అవతారం ఎత్తిన కాళిదాసు వంటారు. నీకు ఇల్లాంటి బుద్ధిపుట్టిందేమా అని మా కందరికీ తీరని విచారము తండ్రీ!’

మాచనమంత్రి లేచి ‘నీ అనుచరులందరూ భోజనాలు చేశారు. ఈ భవనం చుట్టూ వంతులుగా కాపలా ఉంటారట. వారు చీకట్లో కూడా చూడగలరట! నేను వెళ్ళి విశ్రమిస్తాను. మీ అత్తగారు నీ పడకగది చూపిస్తుంది’ అంటూ మేనల్లుడు లేచి తనకు పాదాభివందనం చేయగా ఆశీర్వదించి వెళ్ళిపోయినాడు.

ఇంతలో సర్వాభరణ భూషితురాలై, బంగారపువులు చేసిన కాశ్మీర పుష్ప వర్ణపు పట్టుచీర ధరించి ‘ఎరుపు పట్టు కంచుకము తాల్చి, సరిగలతల తెల్లపట్టు చీర వల్లె చేసుకొని బంగారుబొమ్మ లా కామేశ్వరి సిగ్గుపడుతూ వచ్చి భర్తపాదాలకు నమస్కరించింది.

చిన అక్కిన ప్రగడ కరిగి పోయినాడు. తా నామెను అత్తగారి ఎదుట ఏలాగు స్పృశించును! అయినా ఏదో మొండిధైర్యము చేసి ఆమె రెండు భుజాలు పట్టి లేవనెత్తి ‘బాగా చదువుకుంటున్నావట?’ అని ప్రశ్నించాడు.

“ఎవరు చెప్పినారు!”

“మీ పెద్ద చెల్లి,”

“అది వట్టి అల్లరిపిల్ల!”

“నీ పోలికే! నీ చెల్లి కాదా ఏమిటి?”

“ఆ మరదలిని చూడడానికై నా ఇన్నాళ్ళకుగాని తీరిక కలగలేదు కాబోలు!”

అత్తగారు మాయమైపోయినారు. అక్కినప్రగడ సౌందర్యనిధియై, వలపుల మిటారియై, నవయౌవన పరమావధియైన భార్యను చూచి ప్రేమచే వబికి పోయినాడు. ఆతని సరసత్వ ‘మామెను గాఢంగా హృదయానికద్దుకో, కెంపులులా, తామర పూవు మొగ్గలులా, ఎఱదానిమ్మగింజల కాంతిలా, తేనెలు ఊరే ఆమె పెదవుల్ని ఆస్వాదించు’ అని ప్రబోధించింది. ‘కురుగౌరవమయ్యా! సంప్రదాయమయ్యా! నీకు పునస్సంధానం కాలేదయ్యా! ఆమెను ముట్టరాదయ్యా’ అని ఆచారము బోధించింది. ఒకసారి స్పర్శానందం అణువణువునా అనుభవించి, అమృత మారగించిన దేవేంద్రునిలా ఉన్న అక్కిన ప్రగడ ఆచారము ఒప్పదని