పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

161

మహాయుద్ధంచేసి, విజయంపొంది బొట్టభేతనికి తిరిగి కొఱవిదేశం సమర్పించాడు. ఇంతట్లో ఎఱ్ఱన చనిపోయాడు. అతని భార్య కామమసానిదేవి పల్లవ చక్రవర్తి కడకు బొట్టభేతని తీసుకువెళ్ళి సమస్తమూ పల్లవచక్రవర్తికి నివేదించింది. బొట్టభేత డప్పుడు పదునాలుగేండ్ల బాలుడు. అప్పటికే అతని పరాక్రమం కథలు చెప్పుకుంటున్నారు. ఆ బాలుణ్ణి చూచి పల్లవ చక్రవర్తి భాస్కరవర్మ ఆనందించి ఏబదివేల సైన్యం భేతనికి ఇచ్చినాడు.

భేతభూపతి కామమసాని కుమారుడు. సూరనాయకుడు మొదలయిన సేనాపతులతో కూడి అనుమకొండ ముట్టడించాడు. గాడనాయకుడు అనుమకొండ ఆక్రమించి వున్నాడు. బొట్టభేతడు ఎన్నాళ్ళు ముట్టడి జరుపుతున్నా అనుమకొండ కోటను పట్టలేకపోయాడు. అప్పు డనుమకొండలో వెలసి వున్న తన కులదైవతము కాకతమ్మను ప్రార్థించి బొట్టభేతడు తనతోవున్న ఆ తల్లిపూజా విగ్రహాన్ని పూజించి తన తల పూర్ణాహుతి ఇవ్వబోతే, ఆదేవి ఆకాశవాణిగా ‘నాయనా, వీరభద్రతటాకం ప్రక్కన బురుజును రేపు తాకవయ్యా! విజయం లభిస్తుంది’ అని పలికినదట.

బొట్టభేతడు తన తల బదులు వేయి నారికేళాలు పూర్ణాహుతి ఇచ్చి, మరునాడు కాకతమ్మ చెప్పినచోట బురుజును, కోటగోడను అతి ఉద్థృతంతో తాకినాడట. పదిఘడియలు యుద్ధం జరుగగానే ఆ కోటగోడ పెళపెళ విరిగి పడి పోయిందట. ఆ దారిని బొట్టభేతడు అనుమకొండ కోటలో జొరపడి గాడయను యుద్ధంలో హతమార్చినాడట.

కాకతమ్మ గాథలు ఈలా ఎన్నో ఉన్నాయి. గణపతిదేవచక్రవర్తి పెదతండ్రి రుద్రమహారాజు కలలో కనపడి కాకతమ్మ రాజధాని అనుమకొండ నుండి ఇంకో నూతన స్థలానికి మార్చు మన్నదట. ‘ఆమె ఎక్కడ వెలుస్తుందా’ అని చూస్తూఉంటే, అనుమకొండకు కొంతదూరంలో ఒకకాపు దున్నుకుంటూ ఉండగా నాగేటి చాలులో అమ్మవారి విగ్రహం ఒకటి దొరికిందట. అక్కడే వున్న గొల్లసానికి కాకతమ్మ పూని ‘నేను కాకతమ్మను, నాకు గుడి కట్టండఱ్ఱో’ అని ఊగిసలాడిపోయిందట. రుద్రమహారాజు వెంటనే ఆమె కక్కడ గుడి కట్టించి, అక్కడే కోట కట్టించాడట. ఆ కోటమధ్య ఒంటిశిలకొండ ఉండడంవల్ల ‘ఏకశిలానగరం’ లేక ‘ఓరుగల్లు’ అని పేరు వచ్చింది.

అది మహాపట్టణమై కాకతీయ చక్రవర్తుల నూతన రాజధాని అయినది. కాకతమ్మతోపాటు ఏకవీరాదేవి గుడికూడా ఆ ప్రక్కనే ప్రతిష్ఠ చేయించాడు రుద్రచక్రవర్తి.

ఆ దసరా మహోత్సవాలకు కాకతిమహాదేవి విగ్రహానికి బంగారు తొడుగు తొడుగుతారు, వజ్రవైడూర్యాది రత్నాలు పొదిగిన భూషణాలు పెడతారు. నెల పొడుగుచీరలు కట్టుదురు, కంచుకాలు తొడుగుతారు. దినాని కొక వాహనం చొప్పున