పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీటలమీది పెండ్లి

7

గుఱ్ఱపుస్వారి, ధనుర్విద్య నేర్చుకుంటూ వారందరినీ నిమిషంలో ఓడించేది. ఆ బాలిక బాలికయని రాజబంధువులకూ, ఉన్నత రాజోద్యోగులకూ తక్క మరి ఎవ్వరికీ తెలియదాయెను.

కాని అన్నమాంబకు ఈడువచ్చింది. శైశవము క్రిందటివసంతంలో కలిసి పోయింది.

ప్రభువు అన్నమాంబికను అంతఃపురవాసిని చేశాడు. “అమ్మాయీ! నా చక్రవర్తి ఏలాచేసినా చక్రవర్తిగనుక చెల్లుతుంది. నేను స్త్రీలు స్త్రీలుగా, పురుషులు పురుషులుగా ఉండాలన్న ధర్మాన్ని దాటి కొడుకులు లేనంతమాత్రాన స్త్రీని పేడి వానిలా మగవాడై సంచరించమనడం అపకీర్తి, అధర్మము రౌరవాదినరకహేతువున్నూ అవుతుందని నిశ్చయానికి వచ్చాను” అని ఒకనాడు అన్నాంబికాంతః పురంలో కుమార్తెతో అన్నాడు.

అన్నాంబిక తండ్రిభావాలు విని అత్యంతాశ్చర్యం పొందింది. ఎందుకు ఇంత విచిత్రంగా తండ్రి తన భావాలన్నీ మార్చుకొన్నాడు? లోకానికి అనేక విషయాలలో గురుపీఠము వహించిన శ్రీ శ్రీ గణపతి రుద్రదేవ మహారాజు మరణించగానే ఇంక భయములేదని, తన హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని ఇపుడు బైటపెట్టినారుకాబోలు అని ఆమె కించపడింది.

ఆవెంటనే తన పురుషవస్త్రా లూడ్చినదాయెను. నిడుదయై జానువులవరకూ వేళ్ళాడే కేశభారాన్ని మూడుపాయల జడగావేసి, రత్నాలుపొదిగిన బంగారు కుప్పెలుగల నల్లటి పట్టుకుచ్చులు ధరించింది. తలపై మాణిక్యనాగాభరణము, వజ్ర నక్షత్రాభరణము, ముత్యాలపాపటబొట్టు, గోమేధిక చేమంతిపూవు ధరించింది. ఉత్తమ రాజకన్యోచితమైన కంకణ, కేయూర, హార, మేఖల, నూపురాది ఆభరణాలు తాల్చింది. బంగారు సరిగంచుల పూల నీలపుం బట్టుచీర, ఎఱ్ఱపట్టు కంచుకము మధ్యాహ్నవేళ; ఉదయం కాశ్మీరకుసుమపుచీర, గరుడపచ్చ కంచుకము; సాయంకాలము అరుణకాంతిచీర, బంగారుపచ్చకంచుకము ఆ యా వర్ణాలు శ్రుతిని పొందే వల్లెలున్ను ధరించుట ప్రారంభించినది.

చెంపలకు పుప్పొడి అద్ది చెలులు రచించిన కస్తూరి కుంకుమ మకరికా పత్రాదులు రత్నకర్ణికలతో వియ్యంపొందుతూ ఉండగా, ఆ బాల అరమూతల రెప్పలవెనుక తన అసంతృప్తి దాచుకొన్నదాయెను.

మొదటినుండీ ఆ బాలకు వివాహం ఇష్టంలేదు. బాలునివలె పెరిగిన ఆ బాల పురుషులు స్త్రీలకు పతులు అని ఆలోచించుకొనలేకపోయింది. తనతల్లి మొదలగు స్త్రీలు, తల్లులగుటకే ఉద్భవించారని ఆమె నమ్మకం.

కోటారెడ్డిమహారాజు తనకుమార్తె అన్నమాంబిక పితృభక్తి కలదని నమ్మకంకలవాడుకాబట్టే శ్రీ గోన లకుమయారెడ్డి మహారాజుకుమారులైన వర్ధమాన రాజ్య యువరాజులను వివాహం చేసుకోవలసిందని ఒప్పించారు. హృదయంలో