పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

గోన గన్నా రెడ్డి

సైనికులు అడ్డగించి గౌరవముగా తీసుకుపోయినారు. మా కళ్ళకు గంతలుగట్టి గన్నారెడ్డి సైన్యాలతో నివసించిఉన్న కోటకు కొనిపోయారు. అక్కడ మాకు వారిచ్చిన ఆతిథ్యం వర్ణనాతీతమే. మేము మీ అబ్బాయిగారిని ఆ సమీపాన ఎక్కడా చూడలేదండీ’ అని ప్రతివచన మిచ్చారు.

“గజదొంగ అనే చిహ్నాలేవీ మా కక్కడ కనిపించలేదు. కళ్ళకు గంత లెందుకని మే మాశ్చర్యమందినమాట నిజం. కాని, ఒకసారి వారికోట చేరిన తర్వాత మాకు వారుచేసిన గౌరవం అప్రతిమానం. ఇంతలో ఒకచిన్న మంజూష పట్టుకొని ఒక దళవాయి వచ్చి గన్నయప్రభువుకు అర్పించాడు. ఆయన ఆ మంజూషను కట్టిన ముడిని సునాయాసంగా విప్పి అందులో ఉన్న తాటియాకుల కమ్మనుచూచి ఈలా చదివినారు. ‘స్నేహితుడా! లకుమయారెడ్డి లక్షకాల్బలముతో, ఇతర సైన్యాలతో గన్నారెడ్డిని హతమార్చడానికి వెడుతున్నారు. గన్నారెడ్డి గజదొంగ ఏమిచేయగలడు? పినతండ్రికి దొరకక మాయమవుతాడు. అతనికి ఇది అదనుకాదనేసంగతి తెలుసు. అయిన మీరు మన రాజ్యవ్యవహారాలకు అపశ్రుతిలేకుండా జాగ్రత్తపడి ఉండవలయును. శ్రీ రుద్రదేవమహారాజు శ్రీ శ్రీ గణపతిరుద్రదేవ సార్వభౌముల పెద్దకుమార్తె అనిన్నీ, వారు సార్వభౌములకుగాను రాజప్రతినిధియై పరిపాలనం జేస్తూవుండగలందులకుగాను మహోత్సవం జరిపారు. కాబట్టి మీకు తెలియజేయడమైనది. దేవాలయాలలో, శాసనాదులలో ఇరువురిపేరా పూజాదికాలు, బ్రాహ్మణ పూజలు జరపవలసింది. ఆశీర్వాదాలతో శివదేవయ్య’ అని ఆ ఉత్తరం గన్నయ్యప్రభువు పైకి చదివారండీ” అని ఆ పండితు డూరకున్నాడు.

12

ఓరుగల్లు నగరంలో శ్రీ రుద్రదేవమహారాజు రాజప్రతినిధి అయినందుకు ఉత్సవాలు అఖండంగా జరుగుతూనే ఉన్నాయి. ఆ మహానగరంలో మహా రాజనగరులో, మండలేశ్వర నగరులలో, దేవాలయాలలో దినదినమూ నృత్య గీత వాద్యాలు, పండిత సన్మానములు, తోలుబొమ్మలు, కథాకాలక్షేపములు జరుగుతూ ఉండెను.

మహారాజనగరంలో నృత్యవిద్యాసంపన్నత సభికులకు చూఱలిచ్చే నర్తకీబృందంలో ఉత్తమురాలు మధుసాని. ఆ మధుసాని కిరువది అయిదు సంవత్సరాలు. బంగారురంగు హొరంగుతో, పోతపోసిన విగ్రహంవలె స్ఫుటత్వముగల అవయవాలతో భూమికి దిగివచ్చిన ఘృతాచిలా ఉంటుంది. ఆమె జాయపసేనాని ప్రియురాలు, శిష్యురాలును. జాయపమహారాజు ఆ దివ్యసుందరికి భరత, భామహ, వామభట్టోత్పల, రుద్రట, రుయ్యక, ఆనంద