పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

115

“అందులో ఒక జట్టు కెదురుగా నల్లని గుఱ్ఱం ఎక్కిన వీరు డొకడు తారసిల్లాడు ప్రభూ!”

“అందరూ వీరులే! కవిత్వం చెప్పలేనివాడు, వీరత్వం నెరపలేనివాడు ఈ దినాల్లో ఎవడున్నాడు?”

“చిత్తం, ఆ వీరుడు మా జట్టువాళ్ళను తార సిల్లి ‘మీ వార్తాహరుని కడ నుండి మంజూషను తస్కరించిన దొంగలకడనుండి, శ్రీ గోన గన్నారెడ్డి ప్రభువు జట్టులోని మే మా మంజూషను పాములనుండి గరుత్మంతుడు అమృతభాండము నెత్తికొనిపోయిన రీతిగా లాగికొన్నాము’ అని చెప్పి మాయమైనాడు దేవరా! పట్టుకొందామని ప్రయత్నించారటగాని లాభం లేకపోయిందని మా వాళ్ళు వార్త పంపారు.”

‘ఓహో!’ అని పక పక నవ్వి శివదేవయ్య దేశికులు ‘ఓ వార్తాహరదళాధిపతీ! ఈ విషయంలో మీ లోపం ఏమీలేదు. ఇకముందు వార్తలు పంపు విధానము కొంతకాలంవరకూ మార్పు చేయవలసివస్తుంది. ఇక నీవు వెళ్ళవచ్చును’ అని ఆజ్ఞ ఇచ్చినారు.

వార్తాహరదళాధిపతి వెళ్ళిపోయిన మరుక్షణంలో శివదేవయ్య దేశికులు పక పక నవ్వుకుంటూ “గజదొంగ గన్నారెడ్డి చేతులలో పడిందా ఆ ఉత్తరము? ఈదినాల్లో అన్నిదారులు గన్నారెడ్డినే చేరుతున్నవి. ఏలాంటివా డీ గన్నారెడ్డి! రేపు పినతండ్రితో యుద్ధం ఏలా చేస్తాడు? పినతండ్రి కొన్నిలక్షల సైన్యాన్ని పోగుచేసి శిక్షణయిస్తున్నాడట. లకుమయారెడ్డికి కాకతీయవంశమంటే ఇంతటి విరక్తి ఎందుకో? అన్నగారు బుద్ధారెడ్డి జీవించి ఉన్నంతకాలం సోదరభక్తితో రాజభక్తితో ఉండే లకుమయ్యకు ఆ తర్వాత ఆశ పుట్టింది. కాకతీయులుగాని, వారికి ముందు చాళుక్యులుగాని, వేంగీచాళుక్యులుగాని, చోడులుగాని, వారికిముందు పల్లవ చక్రవర్తులుగాని ఆశవల్లనే సార్వభౌము లయ్యారా?

“కానీ, ధర్మంకోసం, ప్రజలకోసం రాజ్యంచేసే ప్రభువులను ధిక్కరించి సామ్రాజ్యాలు స్థాపించాలని కుట్రచేసినవారు నాశనమే అయ్యారు.

“లకుమయారెడ్డి సామ్రాజ్యం స్థాపించాలని దీక్షవహించాడు. అందుకు విఘ్నేశ్వరపూజ అన్నకుమారునకు రాజ్యంలేకుండా చేయడం! భారతము కౌరవ పాండవ యుద్ధమేకదా! ఆయుద్ధం రాజ్యవాంఛవల్ల నేకదా ఉద్భవించింది! ఈ భయం కరవాంఛవల్ల అర్థమూ, ధర్మమూ నాశనమై, ప్రజాక్షోభ ఉప్పతిల్లుచున్నది.

“రుద్రదేవప్రభువు తండ్రిగారివలెనే జననష్టానికి ఓర్వలేరు. చతురుపాయాలలో మొదటి మూడింటివల్ల నే కార్యాలు చక్కబెట్టుకోవాలి అంటారు.