పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

గోన గన్నా రెడ్డి

ఉంచి, శివదేవయ్యగారి పీఠంకడ ఇంకొకపీఠంమీద అధివసించి, ‘శ్రీ రుద్రదేవ ప్రభువునకు వ్యతిరేకంగా అనేకవిషయాలలో, నాడులలో, మండలాలలో కుట్ర విజృంభిస్తోంది. శ్రీ గణపతి రుద్రదేవసార్వభౌములవారు కోరలూ, నఖాలూ లేని పంచనఖమైపోయారని వారికి ధీమా ఏర్పడింది. ధరణికోటవారు, నిడుదప్రోలు వారు, కోన హైహయులు, కొలనిప్రభువులు, ఇందులూరివారు, కమ్మనాటివారు, నతనాటిసీమవారు, మల్యాలవారు, రేచర్ల వారందరూ, సారంగదేవులు, సాగివారు మనపక్షంవారు. ఆ విషయంలో మనకేమీ సందేహం అక్కరలేదండీ’ అని మనవిచేశాడు.

శివ: సోమనాథభట్టాచార్యా! మీరు నాకు తెలియని విషయాలు తెలియ జేయడంలేదు. నాకు మీరు కనిపెట్టవలసిన ముఖ్యవిషయం ఒకటి ఉన్నది. ఈ కుట్రకు మహానాయకు డొక డున్నాడు. ఎన్నివిధాల ఎంతమంది ప్రయత్నం చేసినా ఆ నాయకుని ఉదంతం ఏమీ తెలియటంలేదు. ఆయన్ను మీరు కనిపెట్టండి. కాకతీయవంశ రక్షకులు కండి మీరు.

సోమ: నా యీ బొందెలో చైతన్యం ఉన్నంతవరకూ, నాకు శ్రీ సోమనాథదేవులు ప్రసాదించిన మేధాశక్తి ప్రసరించగలిగినంతవరకూ ఆ మహాపురుషు డెవ్వరో కనిపెట్ట ప్రయత్నం చేస్తాను. ఆశీర్వదించండి. ఇంటికి వెళ్ళకుండానే ఇదే దేశంమీద పడతాను.

శివ: సత్వర విజయప్రాప్తిరస్తు. దీర్ఘాయురస్తు. ఆచార్యా? వెంటనే వెళ్ళు. నీ దీక్షను కాకతీయసామ్రాజ్యము మరచిపోదు.

సోమనాథు డప్పుడు పాములవానివేషం పూర్తిగా సవరించుకొని, శివదేవయ్య పాదాలకు నమస్కరించి వారిచే అనుజ్ఞాతుడై వెళ్ళిపోయెను.

కాకతీయసామ్రాజ్యానికి శివదేవయ్యకు బూర్వమందు శ్రీ చెన్నాప్రగడ గణపామాత్యుడు మంత్రి. చక్రవర్తికడనే ఉండి, చక్రవర్తి సర్వసేనలకు అధిపతులైన సర్వసైన్యాద్యక్షు లొక రుంటారు. గణపతి రుద్రదేవ సార్వభౌమునకు జాయపసేనాని ప్రస్తుతము సర్వసేనాధ్యక్షుడు. వారికిముందు హేమాద్రిరెడ్డి సర్వ సేనాధ్యక్షులు, వీరుకాక ఆర్థికవిషయాలను గమనించు ప్రధాని యొకడుండును. నాల్గవమంత్రి మహాతలవరి యొకడుండును. ప్రధానిగా పమ్మిపుర పాలకులైన దేవనప్రగడ ఉండెను. మహాతలవరిగా మేచనాయకుడుండెను. ప్రోలరౌతు తంత్రపాలుడుగా ఉండెను.

మహామంత్రి రాజ్యాంగవ్యవహారములు చూచును ముఖ్యసేనాపతి రాజధానిలో ఉండు సామ్రాజ్యసేనల కధిపతి, ఆర్థికవేత్తయగు ప్రధాని సుంకములు, పన్నులు, అడవులు, గనులు, ఓడవర్తకము, వానివాని రాబడి, వివిధ విషయాలకైన వెచ్చము చూచుకొనుచుండును. తలవరి నగరరక్షణ, న్యాయవిచారణ మొదలైనవి చూచును. తంత్రపాలుడు మహామంత్రి ఆజ్ఞలను పరిపాలించు అధికారి.