పుట:Geetham Geetha Total.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16. తే. కర్మమెయ్యదొ, యెయ్యది కర్మగాదొ,
పండితులుగూడఁ దెలియక భ్రమపడుదురు;
వదలు దేనిచే సంసార బంధమెల్ల
దానిఁ జెప్పెద నీకు సుత్రామతనయ !

17. ఆ. కర్మరూప మెఱుఁగఁ గావలె;నట్లె వి
కర్మరూప మెఱుఁగఁ గా వలయును;
మరి యకర్మరూప మరయుటయును నవ
శ్యంబు కర్మగతుల నరయుకొఱకు.

18. తే. కర్మముల నిగ్రహించుట కర్మమనుచుఁ
గర్మములయం దకర్మంబు గల దటంచు
నెఱుఁగు మనుజుం డొనర్చినట్లెల్లకర్మ
ములను; వాఁడె జ్ఞాని యటంచుమునులమతము.

19. ఆ. ఎవఁడొనర్చుకర్మమెంతయుఁ గామసం
కల్పవర్జితంబొ, జ్ఞానవహ్నిఁ
గాల్పఁబడినకర్మగలవాఁడ దెవ్వండొ,
వాఁడె పండితుఁడని పలుకఁబడును.

20. తే. కర్మఫలములయెడల సంగంబు విడిచి
నిత్యతృప్తుఁడవై యాశ నిగ్రహించి
యఖిలకర్మంబులను సదా యాచరించు
వాఁడ వైతేనిఁ జేయనివాఁడ వగుదు.

21. ఆ. ఆశ విడిచి నియతమైనట్టి మనసుతో
మహిని దేనియందు మమత లేక
సల్పవలయు దేహ సంబంధముగఁ గర్మ;
మట్లు నేయఁ, గల్గ దఘము పార్థ!