పుట:Geetham Geetha Total.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

06.తే. భాస్కరుండును జంద్రుండుఁ బావకుండుఁ
జాల రద్దానికిం బ్రకాశం బొనర్ప;
ఎటకుఁ జనువారు మరలి తామిటకు రారో
యట్టిదే నాపరంధామమగును బార్థ!

07. తే. ఆత్మ నాయంశ మయ్యుఁ గర్మానుబంధ
మగుట జన్మంబు లంది బద్ధాత్మ యగుచు
నెల్లవారల ప్రకృతుల నింద్రియంబు
లను మనస్సును నట్టిట్టు లాగుచుండు.

08. ఆ. ఆత్మ యేశరీరమం దుండి వెడలునో
వెడలి యెందుఁ దాఁ బ్రవేశ మగునొ
యచటి కెల్ల నింద్రియాదులఁ గొనిపోవు
వాసనలను గంథవహుఁడువోలె.

09. తే. చక్షువును శ్రోత్రమును మఱి స్పర్శనమును
రసనమును ఘ్రాణము మఱి మానసము ననెడు
వీనినెల్ల నధిష్ఠించి విషయసుఖము
లనుభవించుచు నుండు జీవాత్మ యెపుడు.

10. తే. ఆత్మ గుణమయుఁడై కాయమధివసించి
వెలుగుచుండును, నుండును, విషయసుఖము
లనుభవించును; మూఢు లియ్యది యెఱుఁగరు;
జ్ఞాననేత్రులు మాత్రము గాంచుచుంద్రు.

11. తే. దేహమం దున్న దయ్యును దెలియగలరు
యత్న మొనరించుయోగు లీయాత్మరూప
మకృతబుద్ధు లచేతసులైనవార
లెంత యత్నించినను దాని నెఱుఁగలేరు.