పుట:Geetham Geetha Total.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

06. ఆ. సర్వభూతములకు జన్మ మీ చేతనా
చేతన ప్రకృతులు చేయుచుండు;
నేన హేతు వగుదు నిఖిలజగంబుల
ప్రభవమునకు మఱియుఁ బ్రళయమునకు.

07. ఆ. నన్ను మించి ఘనత గన్నది వేఱొకం
డేదిగాని జగతి లేదు పార్థ!
దారమందు మణులు ధరియింప బడునట్లు
నిఖిల లోకములను నే ధరింతు.

08. తే. జలమునందున్నయట్టి రసంబు నేన;
చంద్ర సూర్యులకున్న తేజంబు నేన;
ప్రణవమును నేన శ్రుతులందు; ధ్వనిని నేన
గగనమునఁ; బురుషుల కేన మగతనంబు.

09. తే. పుణ్యగంధంబు నేన యీ పుడమియందు
జ్వలనుఁ డిలఁ జూపునట్టి తేజంబు నేన;
జీవనము నేన సుమి సర్వజీవములకు;
తాపసశ్రేష్ఠు లొనరించు తపము నేన.

10. తే. సర్వభూతంబులకును బీజంబు నేన
శాశ్వతంబుగ నగుచుందు సవ్యసాచి!
బుద్ధి మంతులయందలి బుద్ధి నేన;
సకల తేజస్యులందుఁ దేజంబు నేన.

11. తే. కామరాగవివర్జిత ఘనగుణు లగు
బలసమేతులయందలి బలము నేన;
ధర్మముఁగ జరియించు భూతములయందుఁ
గామ మే నౌదు నెపుడు సుత్రామతనయ!