పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చలింపలేదు; రమణుడు తాటస్థ్యమును వీడలేదు. అందువలన గణపతిముని శిష్యులు కొందఱు శ్రీఅరవిందాశ్రమమునకు చేరిరి.

1927 ఫిబ్రవరిలో సికిందరాబాదులో జరుగబోవుచున్న శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయముయొక్క రజతోత్సవములకు కార్యకర్తలు వాసిష్ఠుని అధ్యక్షునిగా వరించి ముందుగానే రమ్మని ఆహ్వానించిరి. అందువలన నాయన జనవరిలోనే అక్కడికి చేరెను. సికిందరాబాదులో నాయన పెక్కుచోట్ల ఉపన్యసించి మహర్షి సందేశమును ప్రసరింపజేసెను. వేలకొలది జనులకు ఆయన మంత్రదీక్షల నొసంగెను. రజతోత్సవములకు అధ్యక్షత వహించుచు వాసిష్ఠుడు, మన నాగరికత యంతయు వేదవాజ్మయముపై ఆధారపడియున్నదని, దానిని స్వాధీన మొనర్చుకొనుటకు ఆంధ్రులు సంస్కృతమును మొదట అభ్యసింపవలయునని, పెక్కు సంవత్సరములు గ్రంథములను పఠించినవానికంటె, కొన్ని మాసములు తపస్సు చేసినవాడు అధికముగా వాక్కుయొక్క శక్తిసంపదను పొందునని, మహాకవులందఱు తపస్సుచేతనే మహా గ్రంథములను రచించిరని, వివిధ ప్రాంతములలో భావికాలమున మన భావములు ప్రజలకు చక్కగా బోధపడవలయు నన్నచో గ్రంథములను గ్రాంథికభాషలోనే రచించుట అవశ్యకమని ప్రబోధించెను.

నాయన ప్రబోధించిన గ్రాంథికభాషయొక్క ఆవశ్యకతను వ్యావహారికభాష వలన కలుగుచున్న యనర్థమును ఆంధ్రులు గుర్తింప కుండుట అత్యంతము శోచనీయము. గ్రాంథికశైలివల్లనే నన్నయభట్టునుండి చిన్నయసూరి వఱకు రచింపబడు చుండిన