పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జొచ్చిరి. అ సమయమున ధ్యానము ముగించి నిద్రించుచున్న వాసిష్ఠునకు కలలో గుడిలోని పెద్ద పూజారి కన్పించి, 'ఆచార్యా! మీరు వచ్చినగాని కదలనని భగవంతుడు చెప్పుచున్నాడు; కావున మీరు రావలె' అని మాయ మయ్యెను. మేలుకొన్న తరువాత ఆయనకు 'ఈశ్వరుడు నిన్ను పిలుచు చున్నాడు' అని అశరీరవాణి వినపడెను. అది ఈశ్వరాజ్ఞ అని వెంటనే రథము నొద్దకు వచ్చెను. అప్పుడు ఆ ప్రదేశమున కాపలావారు తప్ప జనులు లేకుండిరి. ఆయన ఈశ్వరునకు నమస్కరించి ఉదయమే వత్తునని నివేదించి నైరృతి లింగ స్థలమునకు తిరిగి వచ్చి నిద్రించెను. తెల్లవాఱి లేచునప్పటికి ఆలస్యమైనదని చింతించుచు ఆయన ఉదయము పది గంటలకు రథము నొద్దకు వచ్చెను. అప్పటికి అది యట్లే నిశ్చలముగా నుండెను. లాగుచున్నవారు ఆయాస పడుచునే యుండిరి. ఆయన లాగుచున్న వారిని ఆగుమని చెప్పి, పూజారులు త్రోవ చూపుచుండగా రథమును సమీపించి దేవుని కెదురుగా నేలపై సాష్టాంగముగ ప్రణమిల్లి 'తండ్రీ! ఇంక నీ రథమును కదలునట్లు అనుగ్రహింపు' మని ప్రార్థించెను. ఆయన లేచి ప్రక్కకు తప్పుకొని గుంపులో కలిసిపోయెను. అప్పుడు ప్రజలు లాగగా రథము సులభముగా కదలెను. 'ఈ మహాభక్తు డెవరో' అని ప్రజలు వెదకుచుండగా, వాసిష్ఠుడు వడివడిగా ప్రక్క సందులలో నుండి దూరముగ నేగెను.