పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలగు విషయములను బట్టి ఋగ్వేద ఋషుల వీర గాధలే మనకు ప్రసిద్ధ పురాణములైన ట్లీ విమర్శ నుండి విదిత మగును. అంతేగాక వేద కాలపు ఋషులు తమ తపశక్తి నీనాటి వేదాంతుల వలె యాధ్యాత్మ సౌభాగ్యమునకే కేవలము వినియోగించుకొని, దేశ సౌభాగ్యము నశ్రద్ద చేయలేదనియు, స్వాతంత్ర్యమునకు భంగము కలిగునప్పు డాంతర్య మందెట్లో బాహ్యమందెట్లే చికిత్స చేయుట కహింసాది ధర్మముల నడ్డు రానీయ లేదనియు విశద మగును. మఱియు, కురు వంశమునకు జెందిన కౌరవులు పాండవుల వలె భారతీయులు కారని ధ్వనించు చుండును."[1]

నాయన గావించిన పరిశోధనలకు కలుగవలసిన ప్రచారావశ్యకతను గూర్చి గుంటూరు శ్రీ లక్ష్మికాంతము ఇట్లు ఉద్ఘాటించెను. "ఈ గ్రంథము వలన మహాభారత పురాణము సంస్కరింపబడుటయే గాక, ఇతర పురాణేతిహాసము లందు నీచపఱుప బడిన ఋషి చరిత్రము లన్నియు సంస్కరింపబడిన వయ్యెను. అట్లే ఋషి సంప్రదాయము లనెడి పేరుతో మనుచున్న కొన్ని న్యాయము లన్యాయములని తేటపఱుపబడి నందున మన వైదికాచారములను శాసించు శాస్త్రములు సంస్కరింపబడిన వయ్యెను. మఱియు నిట్టి వేదార్థ మథనముచే విజ్ఞానకోశ మనదగు ఋగ్వేదము నుండి ఇతర రహస్యముల పరిశోధనకు పూనుకొన వలెనని పండితులకు ఆదర్శ మేర్పడును. కాని యిట్టి ఆదర్శములచే నాకర్షింపబడని ఈనాటి పండితులు గానుగెద్దులవంటివారే కాని స్వతంత్ర విదార శీలురు

  1. * నాయన పుట 648