Jump to content

పుట:Dvipada-basavapuraanamu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

శ్రీకర : భక్తిరత్నాకర ! దోష
భీకర ! విమలగుణాకర ! సంగ !

—: కిన్నరబ్రహ్మయ్య కథ :—


ఇమ్మహి వెండియు నీశ్వరభక్తుఁ
డిమ్ములఁ గిన్నర బమ్మయ నాఁగ
వీరవ్రతై కనిష్ఠారమణుండు
సార శివాచార పారాయణుండు
లోకైకపూజ్యుఁ డలోకానుసారి
యేకాంతభక్తిమహిష్ఠ మండనుఁడు
నఘటితనాద విద్యాపండితుండు
నఘవినాశనకారణావతారుండు 10
విదితకారుణ్య సముదితానురాగ
హృదయుండు, సర్వజీవదయాపరుండు
సల్ల లితుం డన శరణమార్గమున
కెల్ల యై భక్తి మహిష్ఠతఁ బరఁగి
భక్తులకును వర్వుఁబనులు సేయుచును
వ్యక్తిగాఁ బొండూర యుక్తిపెంపునను
గాయకంబులు వెక్కు గఱుచుటఁజేసి
వేయువిధంబుల విత్త మార్జించి,
నిర్వంచకస్థితి శర్వుభక్తులకు
సర్వధనంబులు సమయంగ నంతఁ. 20
గ్రీడార్థమై మఱి కిన్నరవీణ
వేడుక నొకనాడు వినిపింపఁ దడవఁ
గిన్నరేశ్వరవంద్యుఁ డన్నారదాది
సన్నుతనాదానుషక్తుండు మెచ్చి