పుట:DivyaDesaPrakasika.djvu/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆండాళ్

తిరునక్షత్రతనియన్:-
   కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవామ్‌
   పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరజ్గనాయకమ్‌||
నిత్యతనియన్:-
   నీళాతుజ్గ స్తన గిరి తటీ సుప్త ముద్బోధ్యకృష్ణం
   సారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ద మధ్యాపయన్తీ|
   స్వోచ్చిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుజ్త్కే
   గోదా తస్యై నమ ఇదమిదం భూయాయేనాస్తు భూయ:||

వీరు కలియుగాది తొంబది యెనిమిదవ సంవత్సరమగు నళనామ సంవత్సర కర్కాటక శుద్ద(శ్రావణశుక్ల) చతుర్దశీ మంగళవారము పూర్వపల్గునీ నక్షత్రమున జనకచక్రవర్తికి సీతాదేవివలె భూదేవి అంశమున పెరియాళ్వార్లకు కుమార్తెగా అయోనిజగా తులసీ వనమందవతరించిరి. తండ్రిగారు వీరి రూపలావణ్యాదులు చూచి "కోదై" యను తిరునామముంచిరి.

వీరు బాల్యమునుండి తండ్రిగారి యనుష్ఠానమును చూచి వారు వినిపించు శ్రీవిష్ణుపురాణ భాగవతాది కథలను విని శ్రీరంగనాథుని యందు మిక్కిలి ప్రావణ్యము కలవారై యుండిరి. తమ తండ్రిగారు పెరుమాళ్లకై కూర్చిన మాలికలను ముందు తాము దరించి అద్దములో చూచుకొని తాను "శ్రీరంగనాథులకు తగియుంటినా లేదా" అని పరీక్షించుకొను చుండెను.

ఇట్లుండగా ఒకనాడు పెరియాళ్వార్లు ఈ దృశ్యము చూచి అపచారమని నాడు పెరుమాళ్లకు పుష్పకైంకర్యమును నిలిపివేసిరి. వటపత్రశాయి పెరియాళ్వార్లకు స్వప్నమున సాక్షాత్కరించి గోదాదేవి ప్రభావమును తెలిపి ఆమె ధరించిన పుష్పములే తనకు ప్రీతికరములనియు వానినే సమర్పింపుమనియు ఆనతిచ్చిరి.

గోదాదేవియు పరమపురుషుని భర్తగాగోరి ద్వాపరయుగమున గోపికలాచరించిన కాత్యాయనీ వ్రతము నాదర్శముగా ధనుర్మాస వ్రతమాచరించి శ్రీరంగనాథుని వివాహము చేసికొనిరి. వీరనుగ్రహించిన దివ్యప్రబంధములు రెండు. 1 తిరుప్పావై 30 పా. 2 నాచ్చియార్ తిరుమొழி. వీరిప్రభావము గురుపరంపరా ప్రభావాదులలో చూడవచ్చును.

195