పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/584

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

688

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఆ పనికి మాలినపచ్చి శృంగారం వ్రాయక తప్పింది కాదు. పోతన్నంతటి వాఁడికి భోగినీదండకరచన తప్పిందా? వీట్లనిబట్టి కవులఆశయాలు నిర్ణయించడానికి వల్లకాదు. సర్వే సర్వత్రా కవులు “యెవఁడిపిచ్చి వాఁడి కానందం” అన్నసామెతకు దాసులుగానే రచన సాఁగించుకుంటారు గాని, యితరులకు దాసులుగా వుండరనే నా నమ్మకం. ప్రస్తుత గేయాలు కూడా వొకరి ప్రోద్బలంమీఁద వారువారు వ్రాస్తూ వున్నట్టు నాకు తోఁచదు. యీ గేయాలు వ్రాసేవారందఱూ ధారాళంగా పద్యాలు వ్రాయఁగలవారే కాని, సామాన్యులు కారు. కవిత్వానికి ఛందోరీత్యా కూడా మార్పు కలిగించడానికి యీ తోవను నడిపిస్తూన్నారు. యెన్నో విధాల పద్యాలు వున్నప్పటికీ, నన్నయాదులు కొన్నిటిని మాత్రమే స్వీకరించి రచన సాఁగించుకొన్నట్టే వీరున్నూ యెన్నో తాళభేదాలు వున్నప్పటికీ, సర్వసులభంగా వుండే ఆట, ఆది, యీలాటితేలిక తాళాలలోనే వ్రాస్తూ వుంటారు. రహదారీ పడవలు లాగేవాళ్లు పాడుతూంటే చిన్నతనంలో వినడం వుండేది యీబాపతు పదాలు. అప్పటి రోజుల్లో గవర్నమెంటుద్యోగులు సకుటుంబంగా ప్రయాణాలు సాఁగించేటప్పుడు ఆయీపదాలు విని అందులో వుండే పచ్చిశృంగారాన్ని యేవగించుకొని, ఆ కలాసులను మందలించడంకూడా వుండేది. క్రమంగా ఆప్రయాణాలు నామమాత్రావశిష్టాలయినాయి. ఆ పదాలను వరవడిగాఁ బెట్టుకొని కొంత రచన బయలుదేఱింది. ఆ రచననుకూడా కొందఱు ఆదరిస్తూన్నారు. వ్యావహారిక భాషలో వుండడంచేత విద్యాశాఖవారు మాత్రం ఆదరించినట్టులేదు. క్రమక్రమంగా వారుకూడా ఆదరిస్తారనే తోస్తుంది. అందుచేత స్కూళ్లల్లోవుండే వుపాధ్యాయులు “మహారాజులు తల్లీ" "అమ్మా! మాదాకవళం తల్లీ, నీబిడ్డల మన్నం తల్లీ" వగయిరాలు విద్యార్థులకు పాఠం చెప్పవలసిన ఆవశ్యకత కలుగుతుందనే తోస్తుంది. పాఠాని కేం సుళువుగానే చెపుతారు గాని, ఆయిగేయాలు సుస్వరంగా, వుదాత్తానుదాత్తస్వరిత ప్రచయూ లెక్కడెక్కడ వుపయోగించాలో తెలుసుకోవడానికి గేయకర్త శుశ్రూష చేయకపోతే, సాధ్యంకాదు. వేదం మాదిరిని అభ్యసించవలసిందే గాని ఆ సన్నాయి నొక్కులు వగయిరాలు సుఖసుఖాల పట్టుబడేవికావు. యిది నేను స్వయంగా విని కనిపెట్టిన రహస్యం. పూర్వకవులు అన్నిమార్గాలూ తొక్కేశారు. (హృదయగతిన్ బురాతన కవీశ్వరు లేగనివీథి లేదు. బాణోచ్చిష్ట మిదంజగత్) యిఁక మనకి యిది తప్ప రచనకు ఆలంబనం లేదు అని బుద్ధిమంతులు దీన్ని ఆమోదించినట్లు తోస్తుంది. ఆమోదిస్తారు గాక, యీ నవకవిత్వానికి యిదివఱలో -లాక్షణికులు చూపిన లక్షణాలు కాక, ప్రస్తుతలక్ష్యాలను అనుకూలించేలక్షణ గ్రంథాలు లేని లోటు వకటి యిప్పటికీ కనిపిస్తూ వుంది. యీ లోపం కూడా త్వరలోనే తీరితే, దీన్ని యెవరేనా ఆక్షేపిస్తే ఆ లక్షణగ్రంథాల ద్వారా జవాబు చెప్పి