పుట:Bobbili yuddam natakam.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 70

బుస్సీ. - నీవు మానిసివి గావోయి ?

రాజు. - ఏ మన్నను సరియే.

హైదరు. - సాహెబు, నాకీ శెల్వు ఇయ్యండి, నేను ఆ తమాషా చూచి వొస్తాన్.

బుస్సీ. - చూచి వచ్చి మాకు చెప్పుము.

[హైదరు నిష్క్రమించును.

బుస్సీ. - [రాజు నుద్దేశించి] ఏమి రాజా యీస్త్రీలు ఇజార్లు అంగీలు తొడిగి డాలు తర్వారు పూని పోరుదురా ?

తృతీయ నివేదకుడు. - [ప్రవే.] సలాం సర్కార్, బకా ల్బీబీలు, వజ్రాల్ కెంపుల్ బంగారు జవాహరీ యేస్కొని, కాశ్మీర్ బనారస్ చీరల్ ముస్తీబుతో జిగ్జిగ్జిగా మెరుస్తా కోటబురుజుమీద కంటికి చూపడగానే, వారికీ హౌరీలు తల్చుకొని మన తుర్కి సిపాయీలు వఖరికి వఖరు యెన్కకి మోచేతి పోట్లతో నెట్టుకొని తోసుకొని లగ్గలెక్తా వున్నారు. ఎక్డం తొందరలో సగం మంది కింద ఖందకం వుందీ లేదూ, అందులో పడ్తారు. తతిమ్మాసగం... [అను నర్ధోక్తిలో]

బుస్సీ. - స్త్రీలు త్రోయఁగా క్రింద పడి చచ్చినారు, ఇంతే గదా ;

తృ. - బస్ సర్కార్.

[అని నిష్క్రమించును.

బుస్సీ. - మనమును చూతము వచ్చెదరా మహారాజా ?

రాజు. - నాకు క్రొత్త గాదు. మీరే చూడుఁడు.

ద్వి. - [ప్రవే.] సర్కార్ సలాం, బకాల్బీబీలు లగ్గలు యెక్నారే ఆసిపాయీల మీద తెర్లుతావున్న నూనె ఉడుకుడుకు నీళ్లు, కాగుతావున్న అంబళ్లు పోసి 1000టికి, కళ్లల్లో మిరపగుండ గంపల్ గంపల్ గా కుమ్రించి 15000 టికి, కూల్చిన్యార్. తప్పించు కొని ఎక్కి కలియబడినవాళ్లని నోటీలో రోకళ్లతో గుమ్మి పడదోసిన్యారు. సన్నెకళ్లు, రోళ్లు, వేసి ఎందరినో, తల్కాయలు పగల్గొట్టిన్యారు.

[ నిష్క్రమించును

[బుస్సీ ముక్కుపై వ్రేలుంచుకొనును.

చతుర్థనివేదకుడు. - [ప్రవే.] సర్కార్, మనివాడు చండ్రోలు మహమ్మదు ఆ బీబీలతో కలియబడి మిరపగుండ మారెమ్మ కన్ను నిండి కబోదియై రోకటిదెబ్బకీ ఖందకంలోపడి సచ్చీపోయినాడు.

[నిష్క్రమించును.

బుస్సీ. - జిహో వా ! జిహో వా ! మేము పోరిన మే మేమగుదుమో !

[హైదరు రక్తవస్త్రములతో అంబటి తలతో ప్రవేశించును.]

బుసీ. - అరే ! ఎవరు నీవు ?

హైదరు. - క్యా సాబ్, నేను హైదర్జంగు కాదూ ? నాకీ తెల్వదూ మీకీ ?